
సమస్యలు తీర్చకపోతే సమ్మె తప్పదు
అనకాపల్లి: ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో డీఎంఅండ్‌హెచ్‌వో హైమావతికి సోమవారం సమ్మెకు సిద్ధమంటూ నోటీసును అసోసియేషన్ సభ్యులు అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షురాలు ఎస్టేర్ రాణి, కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ ఇన్–సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైమ్–బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50శాతం ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలని, నోషనల్ ఇనంక్రిమెంట్స్ మంజూరు చేయాలని, చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్ కింద వైద్యులకు రూ.5 వేల అలవెన్స్ ఇవ్వాలని, నేటివిటీ–అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలు పరిష్కరించాలని, పీహెచ్‌సీలో వైద్యులకు కచ్చితమైన పని గంటలు, స్థిరమైన వారాంతపు సెలవు ఇవ్వాలని, వైద్యుల జాబ్ చార్ట్, విషపూరితమైన పని వాతావరణాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, పీహెచ్‌సీలో జనాభాకు తగ్గట్టుగా సిబ్బందిని నియమించాలని డిమాండ్లతో సమ్మె నోటీసును అందజేశారు. ఐదు రోజులు పాటు నల్లబ్యాడ్జీలతో నిరసన నిరసన తెలియజేస్తూ, అప్పటికీ సమస్యలు పరిష్కరించని ఎడల సమ్మె చేయడం జరుగుతుందన్నారు. గత ఏడాది సమ్మె చేస్తున్న సమయంలో ప్రభుత్వం చర్యలకు పిలిపించి, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏడాది పూర్తి అవుతున్నా నేటికీ పరిష్కరించకపోవడంతో మారో సారి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు.
డీఎంహెచ్‌వోకు పీహెచ్‌సీ వైద్యుల నోటీసు