
జారిపడిన తూము షట్టర్
దేవరాపల్లి: రైవాడ జలాశయం ఎడమ కాలువ ప్రధాన తూము షట్టర్ల మరమ్మతులు చేస్తుండగా సోమవారం ఒక ఇనుప షట్టర్ కిందికి జారి పడిపోయింది. దీంతో ఈ కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీటితో పాటు జీవీఎంసీ ప్రజలకు తాగునీటి సరఫరాకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. ఈ షట్టర్‌ను ఇంటెక్ చాంబర్ లోపల నుంచి ఇనుప గొలుసుల సహకారంతో బయటకు తీస్తుండగా ఒక్కసారిగా పెద్ద శభ్దంతో నీటిలో పడిపోయింది. ఈ షట్టర్ ఎడమ చాంబర్ మదుంకు అడ్డంగా ఉండిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న జలాశయం డీఈఈ జి. సత్యంనాయుడు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు షట్టర్లలో ఒక షట్టర్ మరమ్మతులు పూర్తయిన తర్వాత రెండవ షట్టర్ మరమ్మతులు చేపట్టనున్నారు. మదుంకు అడ్డంగా ఉండిపోయిన షట్టర్‌ను తీయించి తాగు, సాగు నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చేస్తామని డీఈఈ సత్యంనాయుడు స్పష్టం చేశారు.