
అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
తుమ్మపాల: అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆమెతోపాటు జేసీ ఎం. జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సత్వరమె చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీల స్థితిగతులపై అర్జీదారులు టోల్ ఫ్రీ నంబరు 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ వారం మొత్తం 241 అర్జీలు నమోదు కాగా, వాటిలో అత్యధికంగా 117 రెవెన్యూ శాఖకు సంబంధించి వివిధ రకాల భూసమస్యలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సాగు భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలి...
పూర్వకాలం నుంచి సాగులో ఉంటున్న తమ భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరుతూ మాడుగుల మండలం చింతలూరు, గదబూరు గ్రామాల రైతులు కలెక్టర్‌ను వేడుకున్నారు. బీడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న తమకు పంట నష్టం జరిగితే అధికారులు ఎటువంటి ప్రతిఫలం అందించలేకపోతున్నారని వాపోయారు. భూములకు సర్వే చేపట్టి సాగు ఆధారంగా తమ పేర్లతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని, ఆన్‌లైన్లో నమోదు చేయడం ద్వారా సంక్షేమ పథకాలు పొందగలమని కోరారు. అన్నదాత సుఖీభవ, ఈ –పంట, విత్తనాలు, ఎరువులు, తదితర పథకాలు అందడం లేదని వాపోయారు. 50 మందికి పైగా రైతులు అర్జీలు సమర్పించి తమ గోడును పీజీఆర్‌ఎస్‌లో వినిపించుకున్నారు.
ఎలక్ట్రికల్ వాహనం మంజూరు చేయండి
అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న తనకు ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనం మంజూరు చేసి ఆదుకోవాలంటూ చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు మువ్వల శ్రీను కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. చేతికర్ర, మూడు చక్రాల సైకిల్ బండితో తిరుగుతున్నప్పటికి తీవ్ర శ్రమ పడాల్సి వస్తుందని, కలెక్టరమ్మ స్పందించి ఎలక్ట్రికల్ బండి అందించాలని కోరాడు.
ఎస్పీ కార్యాలయానికి 31 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న
ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయానికి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 31 అర్జీదారులు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భూ తగాదాలు – 16, కుటుంబ కలహాలు – 03, మోసాలకు సంబంధించినవి – 03, ఇతర విభాగాలకు చెందినవి – 09 అర్జీలు స్వీకరించినట్లు ఆయన చెప్పారు. చట్టపరిధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఎస్‌ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయిలో పర్యటించి
సమస్యలను పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్
విజయ కృష్ణన్ ఆదేశం
పీజీఆర్‌ఎస్‌కు 241 అర్జీలు

అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు

అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు