
బుచ్చెయ్యపేటలో భారీ వర్షం
బుచ్చెయ్యపేట: మండలంలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జోరు వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడ్డాయి. వీటి శబ్దానికి పొలాల్లో రైతులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు, ఇళ్లకు చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో ఇళ్ల ముందు వరద నీరు పోటెత్తడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బీఎన్, ఆర్టీ, పెదమదీన, పెదపూడి తదితర గ్రామాల రోడ్డు గోతుల్లో వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బురదలో పలు వాహ నాలు కూరుకుపోయాయి. వడ్డాది పెద్దేరు డైవర్షన్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బంగారుమెట్ట బీఎన్ రోడ్డులో చేరిన వరద నీటిని మాడుగుల ఆర్‌అండ్‌బీ జేఈ సాయి శ్రీనివాస్ పరిశీలించారు. వరద నీరు బయటకు పోయేలా మదుంలు ఏర్పాటు చేయాలని నాయకులు, ప్రజలు కోరారు. ఈ వర్షంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
రాజాంలో చెరువు గండి పడి
రాకపోకలకు అవస్థలు
బుచ్చెయ్యపేట మండలం రాజాంలో అప్పలనాయుడు చెరువుకు గండి పడి రాకపోకలకు అంతరాయం కలిగింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈ చెరువు పూర్తిగా నిండింది. సోమవారం కురిసిన వర్షానికి చెరువుకు గండి పడి రాజాం– తట్టబంద(ఆర్టీ) రోడ్డుపై వరద నీరు పొంగిపొర్లింది. చెరువు నుంచి రాజాం చెరుకు కాటా మూడు రోడ్ల జంక్షన్ వరకు కిలోమీటరు దూరం వరకు వరద నీరు ప్రవహించింది. ఈ రహదారిలో రాకపోకలు సాగించే అనకాపల్లి నుంచి బుచ్చెయ్యపేట, రావికమతం మండలాలకు తిరిగే ఆర్టీసీ బస్సులతోపాటు పలు గ్రామాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీ రోడ్డులోని గోతుల్లో ద్విచక్ర వాహనదారులు పడిపోయి ఇద్దరి సెల్ ఫోన్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

బుచ్చెయ్యపేటలో భారీ వర్షం

బుచ్చెయ్యపేటలో భారీ వర్షం

బుచ్చెయ్యపేటలో భారీ వర్షం