
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
పాయకరావుపేట: మండలంలో సత్యవరం గ్రామానికి చెందిన ముయ్య రాజేష్ (25) గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, సోమవారం కాకినాడలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీఐ జి.అప్పన్న వివరాల ప్రకారం... ఎనిమిది నెలలు క్రితం మృతుడు రాజేష్ తన భార్యతో కుటుంబ ఖర్చుల విషయమై తగాదాపడ్డాడు. అప్పట్లో ఆమె ప్రత్తిపాడులో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రత్తిపాడు ఎస్‌ఐ అక్కడకు రాజేష్‌ను అతడి తల్లిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నెల 5న భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దాంతో ఈ నెల 9న తన భార్యను సత్యవరం తీసుకెళ్లేందుకు రాజేష్ అంగీకరించాడు. ఇంతలో ఈ నెల 6న అతడు మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తొలుత తుని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాకినాడలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 5 గంటలకు మృతి చెందాడు. మృతుడు రాజేష్ తల్లి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.