
నమో జగన్మాత..
● జోరుగా దేవీ విగ్రహాల అమ్మకాలు
● చౌడువాడలో 300 ప్రతిమల తయారీ
● ఉమ్మడి జిల్లా నుంచి వచ్చి కొనుగోలు
కె.కోటపాడు: ఊరూవాడా వినాయక నవరాత్రులు ముగిశాయి. ఇప్పుడు దేవీ శరన్నవరాత్రుల వేడుకలకు సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు దుర్గాదేవి విగ్రహాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరనున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన ఉత్సవ కమిటీలు చౌడువాడలో దుర్గాదేవి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇక్కడ పలు రూపాల్లో తయారైన ఆకర్షణీయమైన విగ్రహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో తయారైన విగ్రహాలు నాణ్యతకు గీటురాయిగా నిలుస్తాయి. తయారుదారులు సైతం సామాన్యులకు అందుబాటులో ధరలు ఉంచటంతో మంచి గిరాకీ ఉంటోంది. ఏటా వినాయక విగ్రహాల తయారీ పూర్తయిన తర్వాత దుర్గాదేవి ప్రతిమలు సిద్ధం చేస్తుంటారు. 60 మంది శిల్పులు అమ్మవారి విగ్రహాలను ఆకట్టుకునే రూపాల్లో జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది 300 దుర్గాదేవీ విగ్రహాలను తయారీ చేయగా, విశాఖపట్నం, అనకాపల్లి, గాజువాక, తదితర ప్రాంతాల నుంచి వచ్చి జోరుగా కొనుగోలు చేస్తున్నారు.
2 నుంచి 10 అడుగుల
ఎత్తు విగ్రహాల తయారీ
ఏటా విజయదశమి సందర్భంగా దేవీ విగ్రహాలను తయారీ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నాం. 60 మంది యువకులతో పాటు మహిళలు వీటిని తయారీ చేస్తుంటారు. వివిధ రూపాల్లో దుర్గాదేవి విగ్రహాలను రెండు నుంచి పదడుగుల ఎత్తు వరకూ తయారీ చేస్తున్నాం. ఇవి రూ.3 వేల నుంచి రూ.15 వేల వరకూ అమ్ముడుపోతుంటాయి.
– బత్తిన నాగరాజు, విగ్రహాల శిల్పి, చౌడువాడ