
వాడనర్సాపురం తీరం నుంచి ఇసుక తరలింపు
● ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న
రెవెన్యూ వర్గాలు..?
● ఇసుక అమ్మకాలపై ఎస్పీకి స్థానికుల ఫిర్యాదు..!
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలం వాడనర్సాపురం సముద్ర తీర ప్రాంతం నుంచి ఇసుక అక్రమ తరలింపుపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. మూడు రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు ప్రారంభించినట్లు సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇసుక తరలింపుపై స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోనప్పటికీ శనివారం రాత్రి ఇసుక ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీస్ సిబ్బందిపై రాజకీయ ఒత్తిడి తీసుకువస్తున్నారు.
గతంలోనే వెలుగులోకి తెచ్చిన సాక్షి..
గత నెల 23న వాడనర్సాపుంలో అనధికారంగా ఇసుక వేలం నిర్వహించిన అంశాన్ని సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. రూ.3 లక్షలకు వేలం దక్కించుకున్న పాటదారునితో పాటు సహకరించిన వారికి అప్పట్లో అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో ఇసుక తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ మూడు రోజుల నుంచి ప్రారంభించడం గమనార్హం. ఏడాదిపాటు సముద్రంలోని ఇసుకను తవ్వేందుకు, కావాల్సిన వారికి విక్రయించేందుకు హక్కులు దక్కించుకున్న పాటదారునికి అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నట్లు తాజాగా పోలీస్ ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాడనర్సాపురం తీరంలో ఇసుక తవ్వకాలు, తరలింపు కోసం ట్రాక్టర్లు కదలాడిన ప్రదేశం