
బలవంతపు భూసేకరణ ఆపాలి
చలో విజయవాడకు
సీపీఎం నేత వెంకన్న పిలుపు
కె.కోటపాడు: బలవంతపు భూసేకరణ ఆపాలని ఈ నెల 24న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న పిలుపునిచ్చారు. మండలంలో ఆర్లిలో చలో విజయవాడ కరపత్రాలను ఆదివారం ఆయన రైతులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతు కూటమి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. రైతుల నుంచి తీసుకునే భూముల్లో పర్యావరణానికి హాని కలిగించే కంపెనీలను ఏర్పాటు చేసి కాలుష్యం వెదజల్లే చర్యలకు తెరతీయనున్నట్లు విమర్శించారు. కె.కోటపాడు మండలంలో ఎస్‌ఈజెడ్ ఏర్పాటుకు 1200 ఎకరాలు, బుచ్చెయ్యపేటలో 1691 ఎకరాలు బలవంతంగా సేకరించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. భూములు ఇవ్వబోమని, ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టవద్దని రైతుల నుంచి ప్రతిఘటన వస్తుందన్నారు. విజయవాడ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు యర్రా దేముడు, ఈర్లె నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.