
శివారు ఆయకట్టుకు సైతం సాగునీరు అందిస్తాం
నాతవరం: నిమ్మకట్టు ఆనకట్ట పరిధిలో ఉన్న శివారు ఆయకట్టుకు సైతం ఖరీఫ్ పంటకు పుష్కలంగా సాగు నీరు సరఫరా చేస్తామని తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ అన్నారు. రాజుపేట అగ్రహారం గ్రామ సమీపంలో తాండవ నదిలో నిర్మించిన నిమ్మకట్టు ఆనకట్టకు శిథిలమైన ప్రధాన గేట్లు రూ.7లక్షలతో ఏర్పాటు చేశారు. ఆ గేట్లను శనివారం తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిథిలమైన గేట్ల స్థానంలో కొత్తగా ఏడు గేట్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త గేట్ల ఏర్పాటుతో లీకేజీ నీరు వృథాగా కాకుండా నిల్వ ఉంటుందన్నారు. ఖరీఫ్ పంటకు శివారు భూములకు సైతం పుష్కలంగా సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు వైస్ చైర్మన్ జోగుబాబు, డీసీ మెంబరు పారుపల్లి దాసు, నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం, ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్, గన్నవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి సింగంపల్లి సన్యాసిదేముడు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు అప్పారావు, నాగబాబు పాల్గొన్నారు.
తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ