
బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి
దేవరాపల్లి: జిల్లాలో బలవంతపు భూసేకరణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న రైతులు, కూలీలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న కోరారు. దేవరాపల్లిలో శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరిట 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలోకి తొక్కి పోలీసులు, సైన్యాన్ని ప్రయోగించి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లాలో బలవంతపు భూసేకరణ జరుగుతున్న ప్రాంతాల నుంచి రైతులు, కూలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గతంలో సేకరించిన భూములకు పరిహారం, పేదలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలవంతపు భూసేకరణ చేపట్టి పోలీసులతో రైతు కూలీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో రెండు పంటలు పండే భూములను గుంజుకొని పర్యావరణానికి హాని చేసే కంపెనీలను పెట్టేందుకు మిట్టల్, ఆదానీలకు వేల ఎకరాలను కట్టబెడుతున్నారని విమర్శించారు. బల్క్‌డ్రగ్ పార్కు, మిట్టల్ స్టీల్‌ప్లాంట్, దేవరాపల్లి మండలం చింతలపూడి పరివాహక ప్రాంతంలో అదాని హైడ్రో పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ కోసం 820 ఎకరాలు, కె.కోటపాడు మండలంలో ఎస్‌ఈజెడ్ కోసం 1200 ఎకరాలు, బుచ్చెయ్యపేట మండలంలో 1691 ఎకరాల భూములను బలవంతంగా సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు.