
నిలిచిన పోలవరం పనులు
IIలో
యలమంచిలి రూరల్: తమ ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యతనిస్తోందని,ఈ ఏడాది డిసెంబరు కల్లా పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలుమార్లు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడంలేదు. ఇందుకు జిల్లాలో జరుగుతున్న పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులే ఉదాహరణగా చెప్పొచ్చు. దార్లపూడి నుంచి తాళ్లపాలెం వరకు జరుగుతున్న 7వ ప్యాకేజీ పనులు నెలరోజులుగా నిలిచిపోయాయి.నిర్మాణ పనులు చేపడుతున్న కేసీఎల్ సంస్థకు రూ.20కోట్లకు పైగా బిల్లుల బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లించడంలేదు.ఫలితంగా కాంట్రాక్టు సంస్థలు కూడా పనులు కొనసాగించలేని పరిస్థితి నెలకొంది.గత 7 నెలలుగా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ 7వ ప్యాకేజీ పనులకు సంబంధించి చేస్తున్న పనుల బిల్లులు సుమారు రూ.20 కోట్లకు పైగా పేరుకుపోయాయి.ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 7వ ప్యాకేజీ పనులు పట్టాలెక్కించిన కూటమి ప్రభుత్వం ఆరంభంలో పోలవరం ఎడమ కాల్వ పనులను త్వరితగతిన చేయిస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించింది. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు సైతం జిల్లాలో 7వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని అధికార్లు చెప్పడంతో కాంట్రాక్టు సంస్థ బిహార్ సహా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు,ఇంజినీర్లను రప్పించి స్ట్రక్చర్లు,అక్విడెక్టుల నిర్మాణ పనులను చేయించింది.పనులు పురోగతిలో ఉన్న సమయంలో కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లింపును ప్రభుత్వం నిలిపివేసింది.సంస్థలో పనిచేసే ఇంజినీర్లు,కూలీలు,వాహనాల అద్దె,ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన కూలీలు సొంతరాష్ట్రాలకు వెళ్లిపోయారు.అద్దెకు తెచ్చిన టిప్పర్లు, ఇతర వాహనాలను యజమానులు తీసుకెళ్లిపోయారు.క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజినీర్లు,సిబ్బంది కూడా విధులకు సక్రమంగా హాజరుకావడంలేదు.ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థ కార్యాలయం వద్ద రెండు,మూడు వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి.వందమందికి పైగా కూలీలు ఉండాల్సిన చోట 10మంది వరకే కూలీలు కనిపిస్తున్నారు. పనులు చురుగ్గా జరిగేటప్పుడు ఏటికొప్పాక వద్ద కాంట్రాక్టు సంస్థ క్యాంపు కార్యాలయం వద్ద సందడిగా ఉండేది.పనులు నిలిపోవడంతో అక్కడ నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది.
డిసెంబరుకు పూర్తి కావడం డౌటే?
జిల్లాలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులు 6,7 ప్యాకేజీలుగా జరుగుతున్నాయి.వీటిలో రూ.331.73 కోట్లతో పాయకరావుపేట నుంచి దార్లపూడి వరకు సుమారు 25 కిలోమీటర్ల పొడవున 6ఏ ప్యాకేజీ పనులు బెంగళూరుకు చెందిన బీఎస్సార్ ఇన్‌ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేస్తోంది.గత ఏడు నెలల్లో 6ఏ ప్యాకేజీ పనులు 18శాతం జరిగాయి.ఈ పనులకు సంబంధించిన ఇటీవల కొంత మొత్తం కాంట్రాక్టు సంస్థకు చెల్లించారు. ఇంకా రూ.25కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.దార్లపూడి నుంచి తాళ్లపాలెం వరకు సుమారు 26 కిలోమీటర్ల 7వ ప్యాకేజీ పనులను రూ.304.98 కోట్లతో అహ్మదాబాద్‌కు చెందిన కేసీఎల్ జేసీసీ సంస్థ చేస్తోంది.7వ ప్యాకేజీలో కొంతమేర పనులు పూర్తయినప్పటికీ ప్యాకేజీలో ముఖ్యమైన ఏటికొప్పాక వద్ద అక్విడెక్టు నిర్మాణ పనులు, కాంక్రీటు స్ట్రక్చర్లతో పాటు తాళ్లపాలెం సమీపంలో కొంత భూసేకరణ జరగాల్సి వుంది.చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు దిక్కుతోచనిస్థితిలో నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.6వ ప్యాకేజీ పనులు వచ్చే ఏడాది జనవరి,7వ ప్యాకేజీ పనులు ఈ ఏడాది డిసెంబరుకు పూర్తి చేయాలని కాల్వ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం గడువు పెట్టింది.సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్దేశించిన గడువులోగా జిల్లాలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులు జరగడం సందేహమే.ఈ ప్రాంత ప్రజలకు జీవనాడిలాంటి పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేసి గోదావరి జలాలలను సాగు,తాగునీరు,పారిశ్రామిక అవసరాలకు అందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.కేంద్రం,రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి కాబట్టి పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
తిమిరాం వారపు సంతకు దసరా శోభ
సంతకు భారీగా వచ్చిన
పొట్టేళ్లు, మేకపోతులు
అమాంతంగా పెరిగిన ధరలు
నాటు కోళ్ల ధరలకు రెక్కలు
పోలవరం ఎడమ ప్రధాన కాల్వ 7వ ప్యాకేజీ పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థకు రూ.20కోట్ల వరకు బిల్లుల చెల్లింపులు జరగాల్సి ఉంది.ఇటీవల కాల్వ నిర్మాణ పనులు నెమ్మదించాయి.వర్షాల కారణంగా కూడా పనులు చేపట్టడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. 6ఏ ప్యాకేజీకి సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లింపులు ప్రారంభమయ్యాయి.7వ ప్యాకేజీ బిల్లులు కూడా త్వరలో చెల్లించే అవకాశం ఉంది. గడువులోగా పనులు పూర్తి చేయలేకపోతే మరోసారి గడువు పొడిగింపునకు కాంట్రాక్టు సంస్థ కోరవచ్చు.
– జి.రామకోటేశ్వరరావు, ఈఈ, పోలవరం
ఎడమ ప్రధాన కాల్వ 6,7 ప్యాకేజీలు
నెల రోజులుగా
7వ ప్యాకేజీ పనులకు బ్రేక్
రూ.20 కోట్లకు పైగా బిల్లుల పెండింగ్
సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన
ఇంజినీర్లు, కూలీలు
కాంట్రాక్టు సంస్థ కార్యాలయం వద్ద
కనిపించని వాహనాలు
డిసెంబరులోగా పనులు పూర్తి డౌటే

నిలిచిన పోలవరం పనులు

నిలిచిన పోలవరం పనులు