
పునరావాస కాలనీకి తరలిరావాలి
నక్కపల్లి: పరిశ్రమల కోసం ఏపీఐఐసీకి నివాస ప్రాంతాలను ఇచ్చిన నిర్వాసితులు ప్రభుత్వం ఏర్పాటు చేసే పునరావాస కాలనీలకు తరలిరావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమె నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వేంపాడు, డీఎల్ పురం, రాజయ్యపేట, అమలాపురం గ్రామాలకు చెందిన నిర్వాసితులతో సమావేశమయ్యారు, 750 మందిని గుర్తించి వారికి పెద బోదిగల్లం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినట్టు చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.8.98 లక్షలు ఇస్తున్నామని, ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక, సిమెంట్, ఐరన్ తక్కువ ధరకు ఇప్పిస్తామన్నారు. అలాగే కాలనీలో డ్రెయినేజీలు, రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుచ్ఛక్తి వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. నిర్వాసితుల్లో ఎంతమంది పునరావాస కాలనీకి రావడానికి సిద్ధంగా ఉన్నారనే వివరాలను తెలుసుకున్నారు. నిర్వాసితులందరూ ఇక్కడకు వచ్చేలా అధికారులు, నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు త్వరగా పూర్తిచేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ మూర్తి, డీటీ నారాయణరావు, పలువురు నిర్వాసితులు పాల్గొన్నారు.
నిర్వాసితులకు కలెక్టర్ సూచన