వరికి ‘సుడి’ దెబ్బ | - | Sakshi
Sakshi News home page

వరికి ‘సుడి’ దెబ్బ

Sep 20 2025 6:05 AM | Updated on Sep 20 2025 6:05 AM

వరికి

వరికి ‘సుడి’ దెబ్బ

రాంబిల్లి(అచ్యుతాపురం): జిల్లాలో వరినాట్లు వేసి 20 నుంచి 30 రోజులు దాటింది. ప్రస్తుత వాతావరణ మార్పులతో వరి పైరులో సుడిదోమ, తెల్లవీపు మచ్చల దోమల ఉధృతి అధికంగా ఉంది. ఈ దోమలు వరి దుబ్బుల ద్వారా రసం పీల్చడంతో పైరంతా ఎండిపోయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్‌ ఇటీవల రాంబిల్లి మండలంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఆర్‌జీఎల్‌ – 2537( శ్రీకాకుళం సన్నాలు) రకానికి దోమల తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బీసీటీ 5204(సాంబమసూరి) రకానికి కొద్దిగానూ, ఎంటీయూ 1062( ఇంద్ర) రకానికి దోమల తాకిడి లేనట్లుగా గుర్తించారు. వరి పంటను ఆశించిన దోమలు, నివారణ మార్గాలు, జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు చేశారు.

దోమల ఉధృతికి కారణాలు...

● అధిక తేమతో కూడిన పొడి వాతావరణం

● మోతాదుకు మించి ఎరువుల వాడకం

● దమ్ము సరిగ్గా చేయకపోవడం

● గట్లు శుభ్రం లేకపోవడం

తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

● ప్రతి రెండు మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు వదలాలి.

● దోమ నివారణకు మందు పిచికారీ చేసేటప్పుడు ముందుగా గట్టు చుట్టూ పిచికారీ చేసిన తర్వాత బొంగరం మాదిరిగా పొలంలో మందు పిచికారీ చేయాలి.

● పొలంలో నీటిని తీసివేసి సాయంత్రం సమయంలో మందు పిచికారీ చేయడం శ్రేయస్కరం

● పొలంలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు నీటిని తీసివేయాలి. అవకాశం ఉన్నంత వరకూ పొలాన్ని ఆరబెట్టాలి.

● సిఫారసు చేసిన మోతాదు మేరకే నత్రజని వాడాలి.

● కొన్ని రకాల మందుల పిచికారీ వల్ల దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు వాటిని నియంత్రించాలి.

నివారణ ఇలా...

ప్రస్తుతం దోమల ఉధృతి అధికంగా ఉన్నందున వాటి ప్రభావం లేని పొలాల్లోనూ వేప నూనె పిచికారీ చేసుకోవాలి.

● దోమ ఉధృతి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎసిఫేట్‌ 75 ఎస్‌పీ 250 గ్రాములు లేదా 300 గ్రాముల చొప్పున లేదా ఇమిడాక్లోప్రిడ్‌ తోపాటు ఎథిప్రోల్‌ 80 డబ్ల్యూజీ 50 గ్రాములు లేదా ఇమిడాక్లోఫ్రిడ్‌ 17.8 శాతం ఎస్‌ఎల్‌ మందు 50 మిల్లీలీటర్లు లేదా బ్యుప్రొఫిజోన్‌ 25 శాతం ఎస్‌సీ 300–320 మిల్లీలీటర్లు చొప్పున ఏదో ఒక మందును ఎకరాకు చొప్పున పిచికారీ చేయాలి.

● దోమ ఉధృతి ఎక్కువగా ఉన్న మేరకు స్థానిక వ్యవసాయాధికారుల సూచనలతో తగిన మందులు పిచికారీ చేయాలి.

● పంట ప్రారంభ దశలో ఉన్నందున దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉన్న మేరకు ముందుగా తక్కువ ప్రభావం ఉన్న మందుల్ని, అప్పటికే తగ్గకపోతే నెల రోజుల తర్వాత అధిక ప్రభావం ఉన్న మందుల్ని స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పిచికారీ చేయాలి.

● నిర్దేశించిన మోతాదుకు మంచి మందును పిచికారీ చేస్తే మళ్లీ దోమల ఉధృతి పెరిగినప్పుడు నియంత్రించడం కష్టమవుతోంది.

● రెండో సారి మందును ఉపయోగించాల్సి వస్తే మొదటి సారి వాడిన మందును కాకుండా వేరొక మందను పిచికారీ చేయాలి.

పైరులో రసం పీల్చుతున్న

సుడిదోమ, తెల్లవీపు మచ్చల దోమ

శ్రీకాకుళం సన్నాలు,

సాంబ మసూరిపై దాడి

నివారణకు బొంగరం పద్ధతిలో

మందుల పిచికారీ మేలు

ఇంద్ర రకం వాడుతున్న రైతులు సేఫ్‌

వరికి ‘సుడి’ దెబ్బ1
1/1

వరికి ‘సుడి’ దెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement