
రూ. 6,400 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు బకాయిపడ్డ రూ.6,400 కోట్లు తక్షణమే కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని విడనాడాలన్నారు. రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాకవరపాలెం మెడికల్ కళాశాలను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.బాబ్జి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత గాలికి వదిలేసిందన్నారు. విద్యార్థులు సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎ. జగదీష్ జిల్లా ఉపాధ్యక్షుడు సింహాద్రి, జిల్లా కార్యదర్శి రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.