
పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపునకు చర్యలు
పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్
మాకవరపాలెం: పరిశ్రమల స్థాపనకు భూములను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.యువరాజ్ తెలిపారు. మండలంలోని రాచపల్లి రెవెన్యూలో 290 ఎకరాల ఏపీఐఐసీ భూములతోపాటు యరకన్నపాలెం వద్ద సర్వే నంబర్ 737లోని పేదల సాగులో ఉన్న భూములను, వాటి మ్యాప్‌లను ఆయన బుధవారం పరిశీలించారు. కలెక్టర్ విజయకృష్ణన్, నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రామన్నపాలెం జంక్షన్ నుంచి యలమంచిలి మండలం పెదపల్లిని కలుపుతూ హైవే వరకు రోడ్డు నిర్మించేందుకు నిర్ణయించిన మార్గాన్ని కూడా సందర్శించారు. 290 ఎకరాల్లో 50 ఎకరాల చొప్పున బ్లాక్‌లుగా ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇదే భూమిలో రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఇప్పటికే అల్లూరి జిల్లా కలెక్టర్ భూములు కావాలన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో భూములను పరిశ్రమలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఏపీఐఐసీలో ఆధీనంలో ఉన్న 290 ఎకరాలతోపాటు యరకన్నపాలెం వద్ద సర్వేనంబర్ 737లో ఉన్న మరో 400 ఎకరాల్లో పరిశ్రమలకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.