19న దేవరాపల్లి వైస్ ఎంపీపీ ఎన్నిక
దేవరాపల్లి : మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ఈ నెల 19న పకడ్బందీగా నిర్వహించనున్నట్లు స్థానిక ఎంపీడీవో సువర్ణరాజు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఈ నెల 12న షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులకు, ఎమ్మెల్యే, ఎంపీకు ఇప్పటికే సమాచారం అందించామన్నారు. 19న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చేతులు ఎత్తే పద్ధతిలో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించి, ఫలితాన్ని వెంటనే ప్రకటిస్తామన్నారు. గతంలో వైస్ ఎంపీపీ–1గా ఎన్నికై న చింతల బుల్లిలక్ష్మి ఇటీవల నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష ఉప ఎన్నికలో ఎంపీపీగా గెలుపొందారు. దీంతో వైస్ ఎంపీపీ–1 స్థానం ఖాళీ కావడంతో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. కాగా ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణిని నియమించినట్టు ఎంపీడీవో తెలిపారు.


