తుపాకుల మోత
పచ్చని కొండల్లో
రంపచోడవరం: అల్లూరి మన్యంలో పోలీసు తుపాకులు గర్జించాయి. పచ్చని కొండలు కాల్పులతో దద్దరిల్లాయి. వై రామవరం మండలం శేషరాయి వద్ద అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత కాకూరి పండన్న అలియాస్ జగన్ ఉన్నారు. ఏజెన్సీలో మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ఇటీవల పాతకోట, గుర్తేడు పరిసర ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. మావోయిస్టు జగన్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబరుగా, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఇతనిపై రూ. 20 లక్షల పోలీసు రివార్డు ఉంది. మృతి చెందిన మరో మావోయిస్టు రమేష్ డీసీఎం క్యాడర్‌లో పనిచేస్తున్నారు.
గాలిస్తున్న బలగాలు
ఎదురు కాల్పుల్లో ఇద్దరితోపాటు మరికొందరు మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్న పోలీసు బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. దండకారణ్యంలో మావోయిస్టులపై అణచివేత ఎక్కువ కావడంతో ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ)ను సేఫ్ జోన్‌గా భావించిన మావోయిస్టుల సంచారం అల్లూరి జిల్లా సరిహద్దులో ఎక్కువైంది. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పట్టు కోల్పోవడంతో తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు లోతట్టు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు గట్టి సమాచార వ్యవస్థతో వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టి అప్రమత్తమవుతూ కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. గిరిజన గ్రామాల్లో మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఎన్నో ఏళ్లుగా మారేడుమిల్లిలో నిర్వహిస్తున్న గుర్తేడు పోలీసుస్టేషన్‌ను గుర్తేడులో ఏర్పాటు చేసి అక్కడ నుంచి పోలీసులు తమ కార్యక్రమాలను విస్తృతం చేశారు. దీనిలో భాగంగా ఏవోబీ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎంతో కాలంగా పూర్తికాని కొన్ని కీలకమైన రోడ్లను పూర్తి చేసేందుకు పోలీస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే పాతకోట– మంగంపాడు, పోతవరం– వై రామవరం, బొడ్డగండి– డొంకరాయి తదితర రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
ప్రశాంతంగా ఉన్న మన్యంలో
ఎన్‌కౌంటర్ కలకలం
ఇద్దరు మావోయిస్టుల మృతితో
భయాందోళనలు
అడవిని జల్లెడ పడుతున్న
పోలీసు బలగాలు


