● మరమ్మతులకు గురవుతున్న వాహనాలు ● కొలతల్లో రీడింగ్ మోసాలు ● పట్టించుకోని తనిఖీ అధికారులు ● వినియోగదారుల ఆగ్రహం
చోడవరం: అసలే ఆకాశాన్నంటిన ధర.. ఆపై ఆయిల్ కల్తీ. నిఘా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పెట్రోల్ బంకుల్లో కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. వినియోగదారుల క్షేమాన్ని వదిలేసి, కేవలం దోపిడీ భావంతోనే పెట్రోల్ బంకుల నిర్వాహకులు ఆయిల్ కల్తీ చేస్తున్నారు. దీంతో రూ.వేలు, లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాహనాలు మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం ఆకాశాన్నంటడంతో వాహనాలపై తిరగడమే అందరికీ భారంగా మారింది. దీనికి ఆయిల్ కల్తీ కూడా తోడవడంతో మరమ్మతులకు గురైన వాహనాలకు పెట్టుబడులు పెట్టలేక వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 100కి పైగా పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. చోడవరం పరిసరాల్లోనే 15 బంకులు ఉన్నాయి. వీటిలో ఆయిల్ కల్తీ ఎక్కువగా జరుగుతోంది. పెట్రోల్, డీజిల్‌లో ఇథనాయిల్, ఇతర క్రూడాయిల్ కల్తీకి పాల్పడుతున్నారు. ఆయిల్ కల్తీతో పాటు కొన్ని బంకుల్లో భూమిలో ఉంచిన స్టోరేజ్ ఆయిల్ ట్యాంకర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపు నీరు పెట్రోల్, డీజిల్ ట్యాంకుల్లో చేరి ఆయిల్‌లో కలిసిపోతుండగా ఆ కల్తీ ఆయిల్‌నే వాహనాలకు వేస్తున్నారు. ఇటీవల పెట్రోల్ బంకుల్లో ఈ తరహా కల్తీతో అనేక వాహనాలు మరమ్మతులతో మూలకు చేరాయి. చోడవరం, వెంకన్నపాలెం, వడ్డాది, రావికమతం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం, యలమంచిలి, తాళ్లపాలెం, నర్సీపట్నం, పెందుర్తి ప్రాంతాల్లోని బంకుల్లో ఆయిల్ కల్తీ మరీ ఘోరంగా జరుగుతోంది. బంకులను ఎప్పటికప్పుడు పరిశీలించి, తనిఖీలు చేయాల్సిన విజిలెన్స్, రెవెన్యూ, తూనికలు–కొలతలు, పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ తనిఖీలు మొక్కుబడిగానే ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు లేకపోవడం వల్ల పెట్రోల్ బంకుల యజమానులు ఇష్టారాజ్యంగా ఆయిల్ కల్తీకి, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారని వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఆయిల్‌తో మరమ్మతులకు గురైన వాహనాలు మార్గ మధ్యలోనే నిలిచిపోవడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లే వారు, అత్యవసర పనులపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఆయిల్ పంపింగ్ చేసే మిషన్ల వద్ద పాయింట్ల రీడింగ్‌లో ఎడ్జిస్టింగ్ చేస్తున్నారు. అసలే లీటర్ పెట్రోల్ ధర రూ. 108.41 ఉండగా డీజిల్ ధర రూ. 98 ఉంది. ఇంత ఎక్కువగా ధరలు పెరిగిపోయి ఆయిల్ వేయించుకోవడమే భారంగా మారిన పరిస్థితుల్లో రీడింగ్‌లో మోసాలు, ఆయిల్‌లో కల్తీతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తక్షణం పెట్రోల్ బంకుల్లో ఆయిల్ కల్తీ, కొలతల్లో మోసాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని, కల్తీని అరికట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు.
●
యథేచ్ఛగా పెట్రోల్, డీజిల్ కల్తీ