● కాంట్రాక్టు ఉద్యోగులనుక్రమబద్ధీకరించాలని డిమాండ్
చింతపల్లి: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ చింతపల్లిలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆదివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... గత దశాబ్దన్నర కాలంగా రోగులకు అన్ని విధాలుగా వైద్య సౌకర్యాలు అందజేస్తున్నప్పటికీ, నేటికీ తమను పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, విధి నిర్వహణలో ఏ ఒక్క ఉద్యోగి మృతి చెందినా... ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు వసంత, గౌరి, సోమేష్ పాల్గొన్నారు.


