ప్రియమైన
డుంబ్రిగుడ: మండలంలోని జైపూర్ జంక్షన్ రోడ్డును ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు సిల్క్ ఫారం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించి 35 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే అది కార్యరూపం దాల్చకపోవడంతో, 1962–63లో ఈ స్థలాన్ని అటవీ శాఖకు బదలాయించారు. ఆ తర్వాత అటవీ శాఖ ఇక్కడ నీలగిరి, సిల్వర్ ఓక్, విదేశీ పైన్ మొక్కలను నాటింది. కాలక్రమేణా విశాఖ–కిరండూల్ రైల్వే లైన్ కోసం కొంత భూమి పోగా, మిగిలిన ప్రాంతంలో భారీ పైన్ చెట్లు పెరిగాయి. అయితే, 2014లో వచ్చిన హుద్‌హుద్ తుపాను ఈ వనానికి పెను ముప్పు తెచ్చింది. సుమారు వెయ్యికి పైగా చెట్లు నేలకూలడంతో పర్యవేక్షణ కరువై, కొద్దిరోజులు ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.
పర్యాటక కాణాచిగా..
గిరిజన ప్రాంతంలో పర్యాటకుల తాకిడి పెరగడంతో, అటవీ శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022–23లో దీనిని ’అరకు పైనరీ’గా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో రూ. 1.02 కోట్ల వ్యయంతో సుమారు 25 ఎకరాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసింది. చెట్లపై ప్రత్యేక కాటేజీలు, వ్యూ పాయింట్లు, కాఫీ హౌస్, టెంట్ హౌస్‌లను అందుబాటులోకి తెచ్చింది.
● హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న ఈ ప్రాంతంలో కొత్తగా పైన్ మొక్కలతో పాటు జామ, అరటి మొక్కలను నాటి వనాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. మరో రెండేళ్లలో వెయ్యి పైన్ మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇక్కడ స్ట్రాబెర్రీ సాగు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు.
పరిశుభ్రతే ప్రాతిపదికగా...
ఒకప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయిన ఈ ప్రాంతాన్ని వనసంరక్షణ సమితి సభ్యులు, అటవీ శాఖ అధికారులు శ్రమించి పూర్తిగా శుభ్రపరిచారు. నాటి నుంచి ఇది పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచింది. ఈ స్వచ్ఛతే దీనికి జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ’స్వచ్ఛత హి– స్వచ్ఛాంధ్ర’ అవార్డులో భాగంగా ఈనెల రెండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ ప్రాంతం పురస్కారాన్ని అందుకుంది. ఇక్కడ స్థానికంగా ప్రత్యక్షంగా 30 మందికి, పరోక్షంగా సుమారు 40 మందికి ఉపాధి లభిస్తోంది. మరి ఈ వీకెండ్‌లో మీరు కూడా ప్రకృతి ఒడిలో ప్రశాంతతను కోరుకుంటే, అరకు పైనరీకి వెళ్లొచ్చి మీ అనుభూతిని సొంతం చేసుకోండి!
పైన్ వృక్షాల మధ్య ఏర్పాటు చేసిన ట్రీహట్
పెద్దలకు : రూ. 40
పిల్లలకు : రూ. 20
ప్రీ–వెడ్డింగ్ షూటింగ్ : రూ. వెయ్యి
సినిమా షూటింగ్ : రూ. 20 వేలు
ప్రవేశ రుసుం వివరాలు
పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు
పర్యావరణాభివృద్ధితో పాటు, పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా అరకులో చేపట్టిన స్ట్రాబెర్రీ సాగు, రంగురంగుల పూల మొక్కల పెంపకం టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ప్రకృతి అందాల మధ్య సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు సందర్శకులు అమితమైన ఆసక్తి చూపుతున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు, బయో నార్మల్ టాయిలెట్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేశాం. అంతేకాదు, ఈ ప్రాంతం సినిమా షూటింగ్‌లకు కూడా అత్యంత అనువుగా ఉండటంతో సినీ పరిశ్రమను సైతం ఆకర్షిస్తోంది. ఇన్ని ప్రత్యేకతలు, పచ్చదనం మధ్య పరిశుభ్రతను పాటిస్తూ ఉత్తమ పురస్కారాలు సైతం అందుకున్నాం. – కోటేశ్వరరావు, అటవీ రేంజర్, అరకు


