కొయ్యూరు: ఉమ్మడి విశాఖ జిల్లా 70వ భారత పాఠశాల సమాఖ్య కుస్తీ పోటీలు శనివారం కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాల–1లో ఘనంగా నిర్వహించారు. తహశీల్దారు ప్రసాదరావు ఈ పోటీలను ప్రారంభించారు. అండర్–14, 17, 19 విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 160 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–14కు 10 మంది బాలురు, 10 మంది బాలికలు, అండర్–17కు 20 మంది బాలురు, 10 మంది బాలికలు, అండర్ 19కు 6 మంది బాలురు, 7 మంది బాలికలు చొప్పున 63 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు కొయ్యూరు కుస్తీ అకాడమీ కోచ్, పీడీ అంబటి నూకరాజు తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 13 వరకు పల్నాడు జిల్లా (ఎన్టీఆర్ జిల్లా పరిధి)లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వెల్లడించారు.


