బైక్‌ దొంగలను పట్టేశారు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగలను పట్టేశారు

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

● అపహరణ కేసులను రెండు రోజుల్లో ఛేదించిన పోలీసులు

● ఆరు స్వాధీనం, ఐదుగురి అరెస్టు

డుంబ్రిగుడ: కొంతకాలంగా వరుస చోరీలకు గురైన ద్విచక్ర వాహనాలకు సంబంధించిన కేసును స్థానిక పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజాసింహారెడ్డి వెల్లడించారు.గత నెల 29న కుసుమవలస గ్రామానికి చెందిన వంతాల త్రినాథ్‌ తన పల్సర్‌ బైక్‌ చోరీకి గురైనట్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ సురేశ్‌ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా నంబర్‌ ప్లేట్లు లేని బైక్‌లను మైనర్లు నడుపుతుండటాన్ని గమనించి ఆరా తీశారు. దీంతో నలుగురు మైనర్లను విచారించగా అసలు గుట్టు బయటపడింది. వారి సమాచారంతో ఎస్‌కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఒక స్కూటీ, హుకుంపేట సంతలో ఒక పల్సర్‌, చటువాలో మరొకటి, పాడేరు కాంప్లెక్స్‌లో ఒకటి, అరకులోయలో మరో బైక్‌తో పాటు విడిభాగాలను విడదీసిన మరో పల్సర్‌ బైక్‌ను.. మొత్తంగా ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మైనర్ల తల్లిదండ్రులకు హెచ్చరిక

బడులకు దూరమైన మైనర్లు బైకులపై మోజు, జల్సాల కోసం ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. పిల్లల నడతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యంత ముఖ్యమని, పిల్లలు బడికి వెళ్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. లేకపోతే పిల్లలు చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు మైనర్లతో పాటు వారికి సహకరించిన హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ బోడిగుడ గ్రామానికి చెందిన కుంబిడి వెంకటరావు అనే నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అరకులోయ సీఐకోటేశ్వరరావు, డుంబ్రిగుడ, అరకు ఎస్‌ఐలు సురేష్‌, మల్లేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement