● అడ్డుకున్న గిరిజన సంఘం నేతలు
ముంచంగిపుట్టు: గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు నాసిరకమైన తినుబండారాలు విక్రయిస్తున్నారని గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎం.ఎం. శ్రీను ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలోని హర్యానా జిలేబీ షాపులో కంపు కొడుతున్న జిలేబీలను వినియోగదారులు గుర్తించి గిరిజన సంఘం నేతలకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. జిలేబీలు చెడిపోయి దుర్వాసన వస్తున్నట్లు తేలింది. వంట నూనెను పరిశీలించే లోపు షాపు యాజమాని దానిని పారబోయడంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే నూనెను పదే పదే మళ్లీ మళ్లీ వాడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కాలం చెల్లిన తినుబండారాలు అమ్ముతున్నారని తెలిపారు. గిరిజనుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సదరు వ్యాపారిపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్, తహసీల్దార్ తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


