● విస్తారంగా వర్షాలు
● జిల్లావ్యాప్తంగా 223.2 ఎంఎం నమోదు
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం కొంతమేర స్తంభించింది. ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, వాగులు, గెడ్డల్లో వరదనీరు ప్రవహిస్తోంది. మరోవైపు వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు ఖరీఫ్ సాగు పనులను వేగవంతం చేశారు. వరి నాట్లు, ఇతర వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 223.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా ముంచంగిపుట్టులో 46.2 మి.మీ, గూడెంకొత్తవీధిలో 35.4 మి.మీ, పెదబయలులో 24.6 మి.మీ, జి.మాడుగులలో 22.4 మి.మీ, పాడేరులో 18.8 మి.మీ, అరకులోయలో 18.6 మి.మీ, డుంబ్రిగుడలో 16.2 మి.మీ, చింతపల్లిలో 12.6 మి.మీ, హుకుంపేటలో 10.8 మి.మీ, అనంతగిరిలో 6.8 మి.మీ వర్షపాతం నమోదైంది.
కూలిన భారీ వృక్షం.. దంపతులకు గాయాలు
ఈదురుగాలులకు పట్టణంలోని సెయింట్ ఆన్స్ కాన్వెంట్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారీ వృక్షం రోడ్డుపై కూలిపోయింది. అదే సమయంలో జి.మాడుగుల వైపు నుంచి స్కూటీపై వస్తున్న దంపతులపై చెట్టు కొమ్మలు పడటంతో వారికి గాయాలయ్యాయి. వారితో ఉన్న చిన్నారి మాత్రం క్షేమంగా బయటపడింది. స్కూటీ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండటంతో తలకు తీవ్ర గాయాలు కాకుండా తప్పించుకున్నారు. గాయపడిన దంపతులను స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. అదే సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. భారీ వృక్షం ఒక్కసారిగా నేలకూలడంతో సమీపంలోని దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. చెట్టును నరికి తొలగించేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో పాడేరు–జి.మాడుగుల రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు, అధికారులు కలిసి చెట్టును తొలగించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.
చెట్టు కూలడంతో..
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి గ్రామానికి సరఫరా అయ్యే 11 కేవీ విద్యుత్ లైన్‌పై భారీ చెట్టు పడటంతో బుధవారం సుమారు ఏడు గంటల పాటు సీలేరు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతంలోని ఓ భారీ చెట్టు సీలేరు పవర్‌హౌస్‌కు సమీపంలో, సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లపై కూలింది. దీంతో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో పాటు ఫీడర్‌కు సంబంధించిన ఇన్సులేటర్ దెబ్బతింది. ఒక విద్యుత్ స్తంభం కూడా నేలకొరిగింది. సమాచారం అందుకున్న జెన్‌కో సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేక పరికరాల సహాయంతో చెట్టును తొలగించారు. అనంతరం దెబ్బతిన్న విద్యుత్ వైర్లు, ఇన్సులేటర్, స్తంభాన్ని మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ఏజెన్సీ, ఒడిశా–పోలవరం సరిహద్దు ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. దారాలమ్మతల్లి ఘాట్ రోడ్ మీదుగా సీలేరు–పోలవరం వెళ్లే ప్రధాన రహదారిలో పెద్ద పెద్ద గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు కష్టంగా మారాయి. దారకొండ నుంచి అటవీ ప్రాంతం మీదుగా గుత్తేడు వెళ్లే రహదారి కూడా పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లిగడ్డ వంతెనతో పాటు పెద్దగంగవరం వాగుల్లో వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి.


