కాఫీ పరిశోధన స్థానం సేవలు అద్భుతం | - | Sakshi
Sakshi News home page

కాఫీ పరిశోధన స్థానం సేవలు అద్భుతం

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిశాంతి, పక్కన కాఫీబోర్డు అధికారులు

హాజరైన అధికారులు

సాక్షి, పాడేరు: తూర్పు కనుమల్లో కాఫీ సాగు విస్తరణలో ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం గత ఐదు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలు అభినందనీయమని, గిరిజన రైతుల కృషితో అరకు కాఫీ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని కలెక్టర్‌ టి. నిశాంతి అన్నారు. ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం 50వ స్వర్ణోత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం పాడేరులోని కాఫీ అతిథి గృహంలో నిర్వహించిన భాగస్వామ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 1971లో కేవలం 15 టన్నులుగా ఉన్న కాఫీ ఉత్పత్తి ప్రస్తుతం జిల్లాలో 15 వేల మెట్రిక్‌ టన్నులకు చేరుకోవడం విశేషమన్నారు. అలాగే తూర్పు కనుమల్లోని ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో కలిపి సుమారు 1.12 లక్షల హెక్టార్లలో కాఫీ సాగు విస్తరించడం చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. 1976లో ఏర్పాటు చేసిన కేంద్ర కాఫీ బోర్డు ఆర్‌వీ నగర్‌ ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం కాఫీ సాగు విస్తరణ, నాణ్యమైన మొక్కల అభివృద్ధి, శాసీ్త్రయ సాగు విధానాల ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించిందన్నారు. కాఫీ తోటల విస్తరణతో పర్యావరణ పరిరక్షణతో పాటు గిరిజనుల జీవనోపాధి మెరుగై, వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు. కాఫీ బోర్డు అధికారులు, శాస్త్రవేత్తలు, పరిశోధన సిబ్బంది, విస్తరణ బృందాలు, ఐటీడీఏ కాఫీ విభాగం, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా గిరిజన రైతుల నిరంతర కృషి ఫలితంగానే అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. అరకు కాఫీ విజయానికి గిరిజన రైతులే అసలైన శక్తి అని ఆమె కొనియాడారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా కాఫీ సాగు విధానాలను మరింత బలోపేతం చేయడం, నాణ్యత పెంపు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అరకు కాఫీని ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్‌ హెచ్‌.ఆర్‌. మురళీధర్‌, ఆర్‌.వి.నగర్‌ ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్‌ డి. సునీల్‌బాబు, కాఫీ బోర్డు మాజీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎస్‌. సూర్యప్రకాశ్‌రావు, మినుములూరు ఎస్‌ఎల్‌వో ఎన్‌. రమేష్‌, జైన్‌ ఇరిగేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నారాయణ్‌, కాఫీ బోర్డు అధికారులు, ఐటీడీఏ కాఫీ విభాగం, జిల్లా ఉద్యానవన శాఖ, ఏపీఎఫ్‌డీసీ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement