సాక్షి, పాడేరు: వచ్చే నెల ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలను తరలిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి. నిశాంతి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజల రవాణా, భద్రత, వైద్య సేవలు, ఆహారం, తాగునీటి ఏర్పాట్లపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా నుంచి తరలివెళ్లే ప్రజల సమన్వయం కోసం జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో అన్ని మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో పోలీసు సిబ్బంది ఒకరిని నియమించాలని సూచించారు. ప్రతి బస్సులో మెడికల్ కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన ఆహారం, తాగునీటి సరఫరాను ఫుడ్ సేఫ్టీ అధికారి గ్రీష్మ పర్యవేక్షిస్తారని తెలిపారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పాడేరు కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నిశాంతి వెల్లడించారు. ఆర్డీవో భుజంగరావు పర్యవేక్షణలో పనిచేసే కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ 9281856953కు అవసరమైన సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే జీతభత్యాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీ అధికారి అనిల్‌కుమార్‌ను ఆదేశించారు. అనంతగిరి, డుంబ్రిగుడ, అరకులోయ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
రుణాల పంపిణీ వేగవంతం
జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, స్వయం ఉపాధి, పరిశ్రమలు తదితర ప్రాధాన్య రంగాలకు రుణాల పంపిణీని వేగవంతం చేయాలని బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు. రుణాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో జేసీ తిరుమణి శ్రీపూజ, డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంతి హెచ్చరిక


