ఏయూలో అద్దె బస్సుల దందా? | - | Sakshi
Sakshi News home page

ఏయూలో అద్దె బస్సుల దందా?

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

ఆర్థిక వనరులున్నా

అద్దె బస్సులపై మమకారం

ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలోనూ

వాటాల ఆరోపణలు

నెలకు రూ.లక్షల్లో

అద్దె చెల్లింపులపై విమర్శలు

ఆర్థిక భారం

వెనుక పారదర్శకతపై ప్రశ్నలు

విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ పాలన గాడితప్పుతోంది. యాజమాన్యం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో వర్సిటీ ఖజానాపై పెను భారం పడుతోంది. ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్న ఏయూలో సొంత వనరులను సమర్థంగా వినియోగించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ట్రాన్స్‌పోర్టు విభాగంలో సొంత డ్రైవర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రైవేటు బస్సులు, కార్లపై మమకారం చూపిస్తుండటం ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాహనాల అద్దెల పేరుతో ప్రతి నెలా రూ.లక్షలు చెల్లిస్తుండటంపై విద్యార్థి, ఉద్యోగ సంఘాల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

పనిలేక సొంత డ్రైవర్లు

ఏయూ ట్రాన్స్‌పోర్టు విభాగంలో గ్రేడ్‌–1 డ్రైవర్లు ఏడుగురు, గ్రేడ్‌–2 డ్రైవర్లు 11 మంది, క్లీనర్లు ముగ్గురు ఉన్నారు. వీరితో పాటు టైమ్‌స్కేల్‌పై ఏడుగురు, 28 రోజుల వేతనంపై ఇద్దరు, కన్సాలిడేటెడ్‌ పేపై ముగ్గురు డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. అవసరమైతే క్లీనర్లు కూడా డ్రైవింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిలో సగానికి పైగా సిబ్బందికి పూర్తి స్థాయిలో పనులు ఉండటం లేదు.

అద్దె బస్సులకే పెద్దపీట

ప్రస్తుతం యూనివర్సిటీకి చెందిన నాలుగు బస్సులు మాత్రమే నడుస్తుండగా, మరో మూడు బస్సులను ప్రైవేటు సంస్థల నుంచి అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఒక్కో బస్సుకు నెలకు సుమారు రూ.1.25 లక్షలు చెల్లిస్తున్నారని, మొత్తం మూడు బస్సులకు దాదాపు రూ.3.75 లక్షల వరకు అద్దె వ్యయం అవుతోందని తెలుస్తోంది. అదనంగా 5 కార్లను కూడా అద్దెకు తీసుకుని ఒక్కో కారుకు నెలకు రూ.25 వేల చొప్పున చెల్లిస్తున్నారు.

అవసరమా... దుబారా వ్యయమా?

మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కాకముందే అదనపు ట్రిప్పుల పేరుతో బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీకి ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పటికీ కొత్త బస్సులను కొనుగోలు చేయకుండా అద్దె వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణాలేమిటనే ప్రశ్నలు ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్నాయి.

పారదర్శకతపై ప్రశ్నలు

సొంత సిబ్బంది, సొంత వనరులు ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాలపై భారీగా ఖర్చు చేయడాన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి. అద్దె విధానాన్ని సమీక్షించి అవసరమైతే సొంత వాహనాల కొనుగోలుపై దృష్టి సారించాలని సూచిస్తున్నాయి. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత పాటిస్తూ అనవసర వ్యయాన్ని నియంత్రించాలని అభిప్రాయపడుతున్నాయి.

‘రింగ్‌ మాస్టర్‌’ ఎవరు?

ప్రైవేటు బస్సుల అద్దె వ్యవహారం వెనుక ఒక కీలక వ్యక్తి పాత్ర ఉందనే చర్చ క్యాంపస్‌లో సాగుతోంది. ఓ కళాశాల ప్రిన్సిపాల్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తే అద్దె వ్యవహారాన్ని సమన్వయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు సంస్థకు, ట్రాన్స్‌పోర్టు విభాగానికి మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందన్న ప్రచారం కూడా క్యాంపస్‌లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement