సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి ప్రధాన కేంద్రమైన ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విశాఖ రీజినల్ కార్యాలయంలో ’పరాయి’ పెత్తనం కొనసాగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక శాఖ మొత్తం డిప్యుటేషన్ అధికారులతోనే నిండిపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మరోసారి అధికారుల బదిలీలు, బాధ్యతల అప్పగింత ఇక్కడ తీవ్ర వివాదాస్పదంగా మారింది. సొంత శాఖలోని అనుభవజ్ఞులైన అధికారులను పక్కనబెట్టి, కీలక పోస్టుల్లో ఇతర శాఖల అధికారులనే కొనసాగించడంపై టూరిజం వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
మాతృశాఖ అధికారులకు తీరని అన్యాయం
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించిన ఏపీటీడీసీ ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. ప్రాంతీయ పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ అంతా రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీ) పరిధిలోనే జరుగుతుంది. అయితే, పర్యాటకరంగానికి పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఆ రంగాన్ని గాలికొదిలేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. కీలకమైన ఆర్‌డీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పోస్టుల్లో ఇతర శాఖల అధికారులనే నియమిస్తున్నారు. మొన్నటి వరకు ఆర్‌డీ అండ్ ఈడీగా విధులు నిర్వర్తించిన పీజీఎస్ కల్యాణిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. అయితే, ఆమె ఇటీవల తనను పర్యాటక శాఖ నుంచి మాతృశాఖకు బదిలీ చేయాలని కోరడంతో ప్రభుత్వం అందుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
మళ్లీ ‘డిప్యుటేషన్’కే పట్టం
ఈసారైనా పర్యాటక శాఖకు చెందిన సీనియర్ అధికారులకు ఆర్‌డీ బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ మళ్లీ నిరాశే ఎదురైంది. రెవెన్యూ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి.. ఏపీ టూరిజం అథారిటీ(ఏపీటీఏ) జిల్లా పర్యాటక శాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న జె.మాధవికి ఆర్‌డీ, ఈడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఏపీటీడీసీ వైస్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఏఎల్ పద్మావతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కీలక పోస్టుల్లో డిప్యుటేషన్ల పర్వం
సొంత శాఖ అనుభవజ్ఞులకు
దక్కని ప్రాధాన్యం
కూటమి ప్రభుత్వ వైఖరిపై విమర్శల వెల్లువ
మాతృశాఖకు వెళ్లిన ఆర్‌డీ కల్యాణి..
మళ్లీ డిప్యుటేషన్ అధికారికే బాధ్యతలు
పర్యాటకాభివృద్ధి ప్రశ్నార్థకమేనా?
దశాబ్దాలుగా సంస్థలోనే సేవలు అందిస్తూ, పర్యాటక రంగానికి సంబంధించిన లోతైన అనుభవం ఉన్న సొంత శాఖ అధికారులను కాదని, వరుసగా ఇతర శాఖల వారికే కీలక బాధ్యతలు కట్టబెట్టడం వెనుక అంతర్యమేమిటని పర్యాటక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. డిప్యుటేషన్‌పై వచ్చే అధికారులకు పర్యాటక రంగంపై పూర్తి అవగాహన ఉండకపోవడంతో ప్రాజెక్టుల నిర్వహణ, అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాఖను సొంత అధికారులతో బలోపేతం చేయాల్సింది పోయి, ఇలా ’డిప్యుటేషన్ల పాలన’ సాగించడం వెనుక ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


