ఘనంగా ఢిల్లీ విజయోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఢిల్లీ విజయోత్సవం

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

సింహాచలం: ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం ఢిల్లీ విజయోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపకులు భగవద్‌ రామానుజాచార్యులు ఢిల్లీ బాద్‌షాను తన పాండిత్యంతో మెప్పించిన సందర్భంగా ఈ ఉత్సవాన్ని ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజున శ్రీవైష్ణవ ఆలయాల్లో నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భగవద్‌ రామానుజాచార్యుల ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి ఆలయ బేడా మండపంలోని హంసవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం వైభవ పారాయణం నిర్వహించి, పల్లకీ సేవతో బేడా తిరువీధుల్లో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు, అర్చకులు కార్యక్రమాలను నిర్వహించారు.

శాస్త్రోక్తంగా తుదివిడత చందన సమర్పణ

ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి తుదివిడత చందన సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ఆలయ బండారంలో భద్రపరిచిన మూడు మణుగుల పచ్చి చందనాన్ని స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆరాధన, బాలభోగం, రాజభోగం సేవలు నిర్వహించారు. దీంతో ఈ ఏడాది నాలుగు విడతలుగా చేపట్టిన చందన సమర్పణ కార్యక్రమం పూర్తయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement