సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లో పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లో పటిష్ట భద్రత

May 28 2026 1:22 AM | Updated on May 28 2026 1:22 AM

మాచ్‌ఖండ్‌లో ప్రమాదంపై

అన్ని కోణాల్లో దర్యాప్తు

చీఫ్‌ ఇంజినీర్‌ రాజారావు వెల్లడి

సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లో మాచ్‌ఖండ్‌ తరహా ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నామని కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కె.వి.రాజారావు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాచ్‌ఖండ్‌లో జరిగిన ప్రమాదంపై ఇప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు. జెన్‌కో హైడల్‌ డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌ నేతృత్వంలో ప్రాజెక్ట్‌ను ఇప్పటికే పరిశీలించామని చెప్పారు. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా మిగతా విద్యుత్‌ కేంద్రాల్లో కూడా భద్రత చర్యలు చేపట్టాలని స్థానిక ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ మేరకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కాలిపోయిన పరికరాలను సిబ్బంది తొలగిస్తున్నారని, అవి తొలగించిన తరువాత నష్టంపై ఒక నిర్ధారణకు వస్తామని చెప్పారు. తనతో పాటు ఏపీ జెన్‌కో డైరెక్టర్‌(హైడల్‌) సుజయ్‌కుమార్‌, సీనియర్‌ ఇంజినీర్లు కలిసి మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని రెండు రోజుల పాటు పరిశీలించామన్నారు. ఎక్కడ ఎటువంటి నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించామని, ముందుగా తక్షణమే కంట్రోల్‌ కేబుల్స్‌ తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆరు యూనిట్లలో రెండింటికి నష్టం వాటిల్లిందని, మిగతా యూనిట్లు పాక్షికంగా సాంకేతికపరంగా నష్టం వాటిల్లిందని చెప్పారు. ముందుగా రెండు యూనిట్లను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రణాళిక రూపొందించామని, మిగతా నాలుగు యూనిట్లలో ఒక్కొక్కటి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒడిశా అధికారులతో కూడా మాట్లాడామన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు తనిఖీలు చేస్తూ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామని సీఈ తెలిపారు. ప్రస్తుతం సీలేరు, మోతుగూడెం విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేదని, ఉత్పత్తికి అవసరమైన నీటి నిల్వలు సీలేరు కాంప్లెక్స్‌ రిజర్వాయర్‌లో ఉన్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement