విత్తన గండం | - | Sakshi
Sakshi News home page

విత్తన గండం

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

ఆకు పోసే వేళ..

నాడు గాదెల్లో ‘సంప్రదాయ’ వైభవం

నేడు పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు

కూటమి ప్రభుత్వంలో అన్నదాతను వేధిస్తున్న ప్రణాళికలోపం

ఏపీ సీడ్స్‌ అనాలోచిత సరఫరా

ఫలితంగా పది కిలోలు వృథా

వ్యవసాయశాఖ కోరుతున్నా

పట్టించుకోని వైనం

కొయ్యూరు: మూడు దశాబ్దాల కిందటి వరకు మన్యంలో వ్యవసాయం ఒక సంప్రదాయ వైభవం. విత్తనాల కోసం రైతు ఏనాడూ ప్రభుత్వం వైపో, ప్రైవేటు దుకాణాల వైపో చూసింది లేదు. పంట చేతికి రాగానే తదుపరి సీజన్‌ కోసం రైతులే నేరుగా విత్తనాలను సిద్ధం చేసుకుని, ఎలుకలు, పురుగులు పట్టకుండా గాదెల్లో భద్రపరుచుకునేవారు. కానీ, కాలక్రమేణా మార్కెట్‌ విత్తనాలు అందుబాటులోకి రావడం, సొంతంగా విత్తనోత్పత్తి చేసే పద్ధతులు మరుగైపోవడంతో అన్నదాతల పరిస్థితి ఇటు సొంతంగా తయారు చేసుకోలేక.. అటు ప్రభుత్వం పూర్తిగా సరఫరా చేయలేక.. దారుణంగా తయారైంది. ఏటా సీజన్‌ ప్రారంభంలో విత్తనాల కొరతతో జిల్లావ్యాప్తంగా రైతాంగం అల్లాడిపోతోంది.

వ్యవసాయశాఖ సూచించినా..

జిల్లాలోని విత్తన కొరతకు, అధికారుల ప్రణాళికా లోపానికి కొయ్యూరు మండలంలో ఉన్న పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ మండలంలో ఏటా ఏడు వేల ఎకరాలకు పైగా వరి సాగవుతుండగా.. వ్యవసాయ శాఖ మాత్రం నాలుగు వేల ఎకరాలకు సరిపడా విత్తనాలను మాత్రమే అందుబాటులోకి తెస్తోంది. అంటే కనీసం 50 శాతం రైతులకు కూడా ఈ విత్తనాలు చాలడం లేదు.

● నిజానికి ఎకరా వరి సాగుకు 20 కిలోల విత్తనాలు సరిపోతాయి. కానీ ఏపీ సీడ్స్‌ సంస్థ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 30 కిలోల బస్తాలను సరఫరా చేస్తోంది. 20 కిలోల బస్తాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ అధికారులు కోరుతున్నా ఏపీ సీడ్స్‌ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీనివల్ల రైతులు ఎకరాకు 20 కిలోలు వేయాల్సింది పోయి 30 కిలోలు చల్లుతున్నారు. ఫలితంగా ఒక్కో ఎకరాకు.. అర ఎకరాకు సరిపడా (10 కిలోలు) విత్తనాలు వృథా అవుతున్నాయి. ఈ అనాలోచిత విధానం వల్ల కొందరు రైతులకు విత్తనాలు ఎక్కువవుతుంటే, మరికొందరికి అసలు దక్కని పరిస్థితి ఏర్పడింది.

బయోమెట్రిక్‌ తప్పనిసరితో....

రైతుల అవస్థలు

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు రైతులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టాయి. గత ఏడాది వరకు ఈ–క్రాప్‌లో నమోదైన వివరాలు, పట్టాదారు పాస్‌ పుస్తకం చూపిస్తే విత్తనాలు ఇచ్చేవారు. కానీ ఈసారి వీటికి తోడు బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరి చేశారు. మన్యంలో నెట్‌వర్క్‌ సమస్యల వల్ల బయోమెట్రిక్‌ పడక ఎంతోమంది రైతులు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీనికి తోడు.. వచ్చే సబ్సిడీ విత్తనాలను కూడా ఒకటి లేదా రెండు ఎకరాలు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఐటీడీఏ పీవో గారు స్పందించండి..

ఇది కేవలం కొయ్యూరు మండల సమస్య మాత్రమే కాదు.. పాడేరు, అరకు, చింతపల్లితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది. ఆకుమడులు పోసే సమయం ఆసన్నమవుతున్నా విత్తనాల కొరత వేధిస్తోంది. ఇప్పటికై నా ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ తక్షణమే స్పందించి, జిల్లావ్యాప్తంగా విత్తనాల కోటాను పెంచాలని, కొయ్యూరుకు అదనంగా కనీసం మరో మూడు టన్నుల విత్తనాలనైనా సరఫరా చేయాలని, అలాగే ఏపీ సీడ్స్‌ నుంచి 20 కిలోల బస్తాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మన్య ప్రాంత రైతాంగం డిమాండ్‌ చేస్తోంది.

50 శాతం మందికి దక్కని రాయితీ..

ప్రభుత్వం వరి విత్తనాలపై 90 శాతం రాయితీ ఇస్తుండటంతో గిరిజన రైతులు వీటి కోసం ఎగబడుతున్నారు. అయితే కోటా సగం మందికే సరిపోతుండటంతో మిగిలిన 50 శాతం మంది రైతులు విత్తనాల కొరతతో అల్లాడుతున్నారు. కొయ్యూరు మండలంలో ప్రైవేటు ఎరువులు, విత్తనాల షాపులు లేకపోవడంతో, విత్తనాల కోసం రైతులు ఇతర మండలాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. అటు సబ్సిడీ లేక, ఇటు రవాణా ఖర్చులు భరించలేక గిరిజన రైతులకు కన్నీరే మిగులుతోంది. విత్తనాల కోటా పెంచాలని మొరపెట్టుకుంటున్నా..రాయితీ నెపంతో అధికారులు పరిమితులు విధిస్తున్నారు.

వరి రైతులకు తప్పని సాగు కష్టాలు

అందరికీ విత్తనాలు ఇవ్వాలి

మండలంలో వరి పండించే గిరిజన రైతులు అందరికీ రాయితీ విత్తనాలు అందేలా చూడాలి. కేవలం కొద్దిమంది రైతులకే విత్తనాలు ఇచ్చి, మిగిలిన వారిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతమాత్రం సరికాదు. క్షేత్రస్థాయిలో అన్నదాతలు పడుతున్న బాధలను అధికారులు అర్థం చేసుకోవాలి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయ శాఖ తక్షణమే విత్తనాల ఇండెంట్‌ను పెంచి, ప్రతి రైతుకూ పూర్తి స్థాయిలో విత్తనాలు సరఫరా చేయాలి.

– బి. రమేష్‌బాబు, ఎంపీపీ, కొయ్యూరు

సరిపడా విత్తనాలు ఇస్తాం

జిల్లాలోని రైతులకు సరిపడా విత్తనాలు అందిస్తాం. ప్రస్తుతానికి జిల్లా కోసం 10 వేల క్వింటాళ్ల విత్తనాలకు ఇండెంట్‌ పెట్టాం. ఒకవేళ ఇవి చాలకపోతే అదనపు కోటా కోసం తిరిగి ఇండెంట్‌ పెడతాం. ఇప్పటికే ఆయా రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు సరఫరా అవుతున్నాయి. అయితే, మేము 10, 20 కిలోల బ్యాగుల రూపంలో విత్తనాలు ఇవ్వాలని ఏపీ సీడ్స్‌ సంస్థను కోరుతున్నా.. వారు మాత్రం 30 కిలోల బస్తాలనే ఇస్తున్నారు. దీనివల్ల విత్తనాలు వృథా అవుతున్నాయి. అదే 10 కిలోల బ్యాగ్‌ ఉంటే అర ఎకరా రైతుకు, 20 కిలోల బ్యాగ్‌ ఉంటే ఎకరా రైతుకు కచ్చితంగా సరిపోయేలా పంపిణీ చేసే అవకాశం ఉండేది.

– నందు, జిల్లా వ్యవసాయ అధికారి, పాడేరు.

Advertisement
 
Advertisement
Advertisement