స్నానానికి దిగి గిరిజన కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

స్నానానికి దిగి గిరిజన కూలీ మృతి

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలపాతం (హనుమరాయి) వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒక గిరిజన కూలీ ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోతంగి పంచాయతీ అంత్రిగుడ గ్రామానికి చెందిన కొర్ర సొంబ్రు (41) అనే గిరిజనుడు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... సొంబ్రు మండల కేంద్రంలోని ఒక చికెన్‌ దుకాణంలో రోజువారీ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం దుకాణంలో పని ముగించుకుని ఆయన తన స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో చాపరాయి గెడ్డకు ఆనుకుని ఉన్న హనుమరాయి వద్ద స్నానం చేయడానికి నీటిలోకి దిగాడు. అక్కడ విధుల్లో ఉన్న జలవిహారి సిబ్బంది దీనిని గమనించి, ఆయనను వారించేలోపే సొంబ్రు హఠాత్తుగా కాళ్లు జారి నీటి ప్రవాహంలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే జలవిహారి సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కేంద్రమైన పాడేరు నుంచి వచ్చిన ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సా యంతో గాలింపు చర్యలు చేపట్టి, సొంబ్రు మృతదేహాన్ని వెలికితీశారు.

కన్నీరుమున్నీరు

సంఘటనా స్థలానికి చేరుకున్న సొంబ్రు కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. దివ్యాంగురాలైన భార్య, చిన్న పిల్లలు ఉన్న ఆ కుటుంబానికి సొంబ్రు ఒక్కడే ఆధారం. సంపాదించే వ్యక్తి ఇలా అకస్మాత్తుగా అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధితుడి కుటుంబ పరిస్థితిని చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

చాపరాయి జలపాతం వద్ద ప్రమాదం

మృతదేహాన్ని వెలికితీసిన ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం

యజమానిని కోల్పోవడంతో

దయనీయ స్థితిలో కుటుంబం

Advertisement
 
Advertisement
Advertisement