కోరుకొండ ఘాట్‌లో ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కోరుకొండ ఘాట్‌లో ప్రమాదం

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

చింతపల్లి: ఎస్‌ఆర్‌ పైప్‌లైన్‌ పనుల నిమిత్తం పెద్ద లారీపై తరలిస్తున్న జేసీబీ ప్రమాదవశాత్తు ఘాట్‌ రోడ్డులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో జేసీబీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బలపం పంచాయతీ ఇటుకబెడ్డలు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రం దామన్‌జోడి నుంచి చింతపల్లి మండలం బలపం పంచాయతీ మీదుగా ఎస్‌ఆర్‌ పైప్‌లైన్‌ ద్వారా ఐరన్‌ ఓర్‌ (ఇనుప ఖనిజం) సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ రెండవ పైప్‌లైన్‌ నిర్మాణ పనులు చేపట్టడానికి ఇటుకబెడ్డలు గ్రామ సమీపంలో పైపులు, ఇతర సామగ్రిని నిల్వ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పనుల నిర్వహణ కొరకు విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి ఒక జేసీబీని పెద్ద లారీపై ఎక్కించి ఇక్కడికి తరలిస్తున్నారు. లారీ బలపం పంచాయతీ పరిధిలోని కోరుకొండ – చెరువూరు గ్రామాల మధ్య గల ఇటుకబెడ్డలు ఘాట్‌ రోడ్డు మలుపుల వద్దకు చేరుకోగానే.. లారీపై ఉన్న జేసీబీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో జేసీబీ డ్రైవర్‌ డి. రమేష్‌కు తలకు, చేతికి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని హుటాహుటిన కోరుకొండ పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే రమేష్‌ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో, అక్కడ నుంచి చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు.

లోయలో పడిన జేసీబీ

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విశాఖ తరలింపు

పైప్‌లైన్‌ పనుల కోసం

తరలిస్తుండగా ప్రమాదం

Advertisement
 
Advertisement
Advertisement