పెదబయలు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దుమత్స్యగెడ్డ వంతెన సమీపంలో గల్లంతైన గిరిజన రైతు వంతాల నాగేశ్వరరావు (35) మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. మునిగిపోతున్న తన ఇద్దరు చిన్నారులను ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చిన ఆయన.. ఆ తర్వాత ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతవడం తెలిసిందే. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు నాటు పడవల సహాయంతో రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడటంతో గాలింపు నిలిపివేయాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం తిరిగి గాలింపు ప్రారంభించగా.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వంద అడుగుల దూరంలో, వంతెన కింద నాగేశ్వరరావు మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
మాకు దిక్కెవరు?
విలపించిన మృతుని భార్య
పిల్లల ప్రాణాలు కాపాడి, తన ప్రాణాలను అర్పించిన నాగేశ్వరరావు ఉదంతం కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. భర్త మృతదేహాన్ని చూసి భార్య ఈశ్వరమ్మ బోరున విలపించింది. వ్యవసాయం, కూలి పనులు చేస్తూ ఆయనే మా కుటుంబాన్ని, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. పిల్లలకు ప్రాణదానం చేసి ఆయన వెళ్లిపోయాడు.. ఇప్పుడు మా కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయాం. మాకు దిక్కెవరు?.. అంటూ కంటతడి పెట్టింది. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని, పిల్లల చదువులను ఆదుకోవాలని ఆమె వేడుకుంది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో స్థానిక ఎంపీటీసీ కిమంకరి బొంజుబాబు, మాజీ సర్పంచ్ పలాసి మాధవరావు ఉన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని వారు కోరారు.


