● రాష్ట్రస్థాయిలో అత్యధిక ప్రసవాలు
● ఉత్తమ ఆస్పత్రిగా గుర్తింపు
● ఉన్నతాధికారుల నుంచిప్రశంసాపత్రం
ముంచంగిపుట్టు: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా, సురక్షితంగా ప్రసవాలు చేసిన ఉత్తమ ఆసుపత్రిగా నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర హెల్త్ సెకండరీ డైరెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు వైద్యులు, సిబ్బంది ప్రతిభను కొనియాడుతూ శుక్రవారం ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని ఆసుపత్రికి పంపించారు. గిరిజన ప్రాంతంలో రికార్డు స్థాయిలో ప్రసవాలు నిర్వహించి, గర్భిణులకు అండగా నిలిచినందుకు గాను ఈ పురస్కారం లభించింది.
వైద్యులు, సిబ్బంది సామూహిక కృషి..
సూపరింటెండెంట్ ధరణి
ఈ సందర్భంగా సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి మాట్లాడుతూ... ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ గర్భిణులకు అందించిన నాణ్యమైన సేవలకు దక్కిన ప్రతిఫలమే ఈ పురస్కారమని హర్షం వ్యక్తం చేశారు. ప్రసవాల సమయంలో సిబ్బంది తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలు, అంకితభావం వల్లే మారుమూల ప్రాంతంలోనూ అత్యధిక ప్రసవాలు చేయడం సాధ్యపడిందని ఆమె వివరించారు. రాష్ట్ర స్థాయి ప్రశంసా పత్రం లభించడం తమకెంతో ఆనందాన్ని ఇస్తోందని, భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆమె పేర్కొన్నారు. సీహెచ్‌సీకి ఈ గౌరవం దక్కడంపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు వైద్యాధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.


