ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో ఎస్సీ సామాజిక వర్గానికి రాజ్యాంగం కల్పించిన 22 శాతం రోస్టర్‌ను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మతో కలిసి రిజర్వేషన్లు, పదోన్నతులు, కాంట్రాక్ట్ పనుల కేటాయింపులపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ ఉద్యోగుల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేయాలంటూ జీవీఎంసీ ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. సీతారాం మాట్లాడుతూ ఎస్సీల ఆర్థికాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు, కాంట్రాక్ట్ పనుల్లో వారికి తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. ఇంజినీరింగ్ పనుల కేటాయింపుల్లో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందన్న ఫిర్యాదులు కమిషన్ దృష్టికి వచ్చాయని తెలిపారు. రూ.9 కోట్ల విలువైన పనుల్లో కేవలం రూ.20 లక్షల పనులు మాత్రమే ఎస్సీ వర్గానికి కేటాయించడంపై అధికారులను ప్రశ్నించారు. ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన 22 శాతం నిధులు, పనులు తప్పనిసరిగా కేటాయించాలని స్పష్టం చేశారు. ఎస్సీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


