కశింకోట: స్థానిక జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ లక్ష్మణరావు అందించిన వివరాలు.. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు స్థానిక కూడలిలో ఆగి ఉన్న బ్రాండిక్స్ ఉద్యోగుల వ్యాన్‌ను ఢీకొంది. దీంతో ఆ వ్యాన్ రోడ్డు దాటడానికి బైక్‌పై సిద్ధంగా ఉన్న బయ్యవరం గ్రామానికి చెందిన షేక్ న్యామతుల్లా (65)ను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన షేక్ న్యామతుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. అనకాపల్లి మండలం వేట జంగాలపాలెం నుంచి అచ్యుతాపురం వద్ద బ్రాండిక్స్ పరిశ్రమలో విధులకు వెళ్లడానికి వ్యాన్‌లో ప్రయాణిస్తున్న అదే గ్రామానికి చెందిన బండి లక్ష్మి, కొడాలి సత్యవతి, రూప, కుమార్ గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన న్యామతుల్లా మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం జరిపించి, కేసు నమోదు చేసి సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణమైన పశ్చిమ బెంగాల్‌కు ఖాళీగా వెళుతున్న బస్సును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. న్యామతుల్లా కూరగాయలు కొనుగోలు కోసం కశింకోటకు వస్తూ రోడ్డు దాటుతుండగా ప్రమాదంలో మృతి చెందాడు.


