జైల్లో కంప్యూటర్‌ మాస్టర్‌ | - | Sakshi
Sakshi News home page

జైల్లో కంప్యూటర్‌ మాస్టర్‌

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

క్షణికావేశం ఖైదీని చేసింది విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ‘ఐఐటీ మద్రాస్‌’ ప్రొఫెసర్‌ ఖైదీల కోసం ‘ఆఫీస్‌ అసిస్టెంట్‌’ ఐటీ శిక్షణకు శ్రీకారం ప్రొఫెసర్‌ను ట్రైనర్‌గా నియమించిన జైలు శాఖ ఇతని వివరాలు తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేసిన కలెక్టర్‌

ఐఐటీ ప్రొఫెసర్‌

ఆరిలోవ: విధి ఆడే వింత నాటకంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో ఊహించడం కష్టం. బయటి ప్రపంచంలో వందలాది మంది మేధావులను, ఐఐటీ ఇంజనీర్లను తీర్చిదిద్దిన ఓ ప్రొఫెసర్‌.. క్షణికావేశంలో చేసిన నేరానికి ఖైదీ దుస్తులు ధరించి, జైలు నాలుగు గోడల మధ్య తోటి ఖైదీలకు కంప్యూటర్‌ పాఠాలు చెబుతున్నాడు. విశాఖ కేంద్ర కారాగారంలో వెలుగుచూసిన ఈ ఆసక్తికర ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖ చరిత్రలోనే తొలిసారిగా.. ఖైదీల కోసం ‘ఆఫీస్‌ అసిస్టెంట్‌’ పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణ కోర్సును జైలు అధికారులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ గురువారం ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2018 నుంచి నిలిచిపోయిన నైపుణ్య శిక్షణలు, సుమారు 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ ప్రారంభం కావడం ఒక విశేషమైతే.. గంజాయి కేసుల్లో చిక్కుకుని జీవితాలను పాడుచేసుకుంటున్న యువ ఖైదీలకు మాత్రమే (ప్రస్తుత బ్యాచ్‌లో 30 మంది) ఈ రెండు నెలల ప్రత్యేక శిక్షణ ఇస్తుండటం మరో విశేషం.

గురువుగా మారిన ఐఐటీ ప్రొఫెసర్‌

అయితే..ఈ శిక్షణ కేంద్రంలో అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వీరికి కంప్యూటర్‌ నైపుణ్యాలు నేర్పిస్తున్న శిక్షకుడు బయటి నుంచి వచ్చిన వ్యక్తి కాదు.. ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒక తోటి ఖైదీయే కావడం. ఆయన సామాన్యుడు కాదు.. ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఐఐటీ మద్రాస్‌’లో ప్రొఫెసర్‌గా పనిచేసిన మేధావి. చైన్నెకి చెందిన ఈయన ఓ కేసు వ్యవహారంలో పదేళ్ల జైలు శిక్షకు గురయ్యారు. చైన్నె జైలు నుంచి ఎనిమిది నెలల క్రితమే బదిలీపై విశాఖ కేంద్ర కారాగారానికి వచ్చారు.

ప్రతిభను గుర్తించిన అధికారులు

సాధారణంగా ఇలాంటి కోర్సులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలే ఇన్‌స్ట్రక్టర్లను పంపుతాయి. కానీ అత్యవసరంగా ఈ బ్యాచ్‌ ప్రారంభించాల్సి రావడంతో, జైల్లోనే ఉన్న ఈ ఐఐటీ ప్రొఫెసర్‌ ప్రతిభను జైలు సూపరింటెండెంట్‌ ఎం. మహేష్‌ బాబు, డిప్యూటీ సూపరింటిండెంట్‌ సీహెచ్‌. సూర్యకుమార్‌ గుర్తించారు. గంజాయి కేసుల్లో పడి జీవితాన్ని కోల్పోతున్న యువతలో మార్పు తెచ్చేందుకు ఈయన విద్యార్హత, అనుభవం దోహదపడతాయని భావించి, ఆయననే శిక్షకుడిగా నియమించారు. జైలు నిబంధనల ప్రకారం లోపల పరిశ్రమల్లో పనిచేసే నైపుణ్యం గల ఖైదీలకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని ఈ ప్రొఫెసర్‌కు కూడా చెల్లించనున్నారు.

కలెక్టర్‌ ఆశ్చర్యం.. అభినందనలు

ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌.. ఈ పీహెచ్‌డీ ఖైదీ ప్రొఫెసర్‌ గురించి, ఆయన నేపథ్యం గురించి ఆరా తీసి ఆశ్చర్యానికి లోనయ్యారు. జైలులో ఉంటూ కూడా తోటి ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విద్యాబోధన చేస్తున్న ఆయనను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement