● మారుమూల ప్రాంతాల విద్యార్థుల్లో
ప్రతిభకు తోడ్పాటు
● ప్రాచీన విద్యా నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ
అచ్యుతాపురం రూరల్: మన సంస్కృతీ సంప్రదాయాల్నీ, దేశంలో దాగి ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని విద్యార్థులకు తెలియజేయడంలో ‘సైన్స్ అండ్ ఇండిజినస్ టెక్నాలజీ ఆన్ వీల్స్’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన బస్సులో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యటించి 70కి పైగా పాఠశాలల్లో 50 వేలకుపైగా విద్యార్థులను చైతన్య వంతులను చేస్తున్నారు. ఈ బస్సు లోపల భాగంలో ప్రాచీన స్వదేశీ విద్యా విధానంలో గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, పంచాంగం, పురావస్తు వ్యవస్థ, సాంప్రదాయ ఆహారం, ఆయుర్వేదం, లోహశాస్త్రం, వాస్తు శాస్త్రం, సేంద్రియ వ్యవసాయం, విద్యుత్ ఉత్పాదన వంటి చార్టులు, పరికరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్నతమైన విద్యా విధానం పెంపొందించడంలో బస్సులో ఉండే పరికరాలు ఆకర్షితులను చేస్తున్నాయి. వైదిక గణిత బోధనంలో రేఖా చిత్రాల ప్రదర్శనలు నిపుణుల ద్వారా సరళమైన పద్ధతిలో గణిత బోధనలు తెలియజేస్తున్నారు. ఖగోళ శాస్త్రంలో పంచాంగ వికాసం, గ్రహణాలు ఏర్పడే విధానం, ఉదయిస్తున్న సూర్యుని స్థానంలో వచ్చే మార్పులను వివరిస్తున్నారు. భారతీయ ప్రాచీన కళ, సాంస్కృతిక వ్యక్తీకరణాలను, వారసత్వ వాస్తు శిల్పాలు ప్రదర్శిస్తున్నారు. చేతి వృత్తులు అనగా చేనేత వస్త్రాల తయారీ, మట్టి కుండలు, లోహాలతో పనిముట్లు తయారీ విధానం తెలుసుకోవచ్చు. ప్రాచీన కాలంలో విద్యుత్ ఉత్పత్తిని వీచే గాలి, బయోగ్యాస్ ద్వారా తయారు చేసే విధానాన్ని తెలియపరుస్తున్నారు. దేశీయ ఆరోగ్య విధానంలో మూలికలు, సుగంధ ఔషధ మొక్కలు, ప్రకృతి వైద్యం ఆరోగ్య సంరక్షణ విధానాలపై అనుభవపూర్వక అభ్యాసాలపై వివరణ కల్పిస్తున్నారు.


