మాడుగుల రూరల్: మాడుగుల పాండవుల చెరువులో ముందుగా ఆక్రమణలు తొలగించి, అభివృద్ధి పనులు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడారు. ఇక్కడ చెరువు ఆక్రమణలపై గత నెల 27వ తేదీన కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై దర్యాప్తు చేయకుండా అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. మోదమాంబ గుడి సమీపంలో సర్వే నంబరు 258లో 11 ఎకరాలు 50 సెంట్లు పాండవుల చెరువు ఉందన్నారు. ఈ చెరువు కబ్జా బాగోతం బయటపడకుండా ఎమ్మెల్యే సహకారంతో కూటమి నాయకులు అభివృద్ధికి పూనుకున్నారన్నారు. మానస సరోవరం పేరుతో నాబార్డు మంజూరు చేసిన రూ. 50 లక్షలతో కొంతమేర అభివృద్ధి చేసినట్లు చూపించి, కొంత మొత్తం నిధులు పంచుకోవడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. దీనిపై తహసీల్దారు, ఇతర ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చెరువు ఆక్రమణలు తొలగించకుండా పనులు చేపట్డడం సరికాదన్నారు. ఆక్రమణలు తొలగించే వరకు స్థానికులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు
వెంకన్న, మండల కార్యదర్శి నర్సింహమూర్తి


