కొమ్మాది: నగరంలో అనేక చోట్ల కొండలను గుండులుగా మార్చి కూటమి ప్రభుత్వం ప్రకృతికి విఘాతం కలిగిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు మెరవ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిమ్మాపురం కొండపై నిర్మిస్తున్న యూనిటీ మాల్ ప్రాంతాన్ని పార్టీ ఐటీ వింగ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు విస్మరించి ఈ ప్రాంతంలో యూనిటీ మాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రుషికొండ ప్రభుత్వ భవనాల నిర్మాణ సమయంలో పర్యావరణ విధ్వంసం జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కూటమి నాయకులు, అదే ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ వింగ్ కార్యదర్శి గీతారెడ్డి, నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు తాలూరి అశోక్, అనీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.


