మత్స్యగెడ్డ కాదు.. మృత్యుగెడ్డ! | - | Sakshi
Sakshi News home page

మత్స్యగెడ్డ కాదు.. మృత్యుగెడ్డ!

May 22 2026 12:24 AM | Updated on May 22 2026 12:24 AM

ప్రవాహంలో తనయుడు, మేనల్లుడు మునిగిపోవడం చూసి తల్లడిల్లిన గుండె

ప్రాణాలకు తెగించి ఇద్దరు చిన్నారులను ఒడ్డుకు చేర్చిన వైనం

వారిని కాపాడే క్రమంలో ప్రవాహంలో కొట్టుకుపోయిన నాగేశ్వరరావు

లభ్యం కాని ఆచూకీ

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు

పెదబయలు: చేపల వేటకు వెళ్లి, నీటిలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఒక తండ్రి.. తాను మాత్రం గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైన హృదయవిదారక ఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని సీతగుంట పంచాయతీ ముసిడిపుట్టు గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావు (35) గురువారం ఉదయం గుత్తులపుట్టు వారపు సంతకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తన కుమారుడు వంతాల వరుణ్‌, మేనల్లుడు పసుపుల సాత్విక్‌లను వెంటబెట్టుకుని పెదబయలు సమీపంలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మత్స్యగెడ్డ వంతెన వద్దకు వెళ్లారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం వైపు నుంచి గెడ్డలోకి దిగి వలతో చేపలు పడుతున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో చిన్నారులిద్దరూ గెడ్డ ఒడ్డున దిగి ఈత కొడుతుండగా, ఒక్కసారిగా లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోసాగారు. గమనించిన నాగేశ్వరరావు తక్షణమే స్పందించి, ప్రాణాలకు తెగించి వారిద్దరినీ పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే, పిల్లలను కాపాడే క్రమంలో ప్రవాహ వేగానికి నాగేశ్వరరావు నీటిలో మునిగిపోతూ గల్లంతయ్యాగు. పిల్లల అరుపులు విని కొంత దూరంలో చేపలు పడుతున్న మిగతా వారు వచ్చేసరికే నాగేశ్వరరావు నీటిలో కొట్టుకుపోయాడు. ప్రమాద సమాచారం తెలియడంతో భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది.

లభ్యం కాని ఆచూకీ

మత్స్యగెడ్డలో గల్లంతైన నాగేశ్వరరావు కోసం స్థానికులు నాటు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహం లభ్యం కాలేదు. చీకటి పడటంతో ప్రస్తుతానికి గాలింపు నిలిపివేశారు. ప్ర మాద స్థలాన్ని స్థానిక తహసీల్దార్‌ త్రినాథరావు నా యుడు, ఎంపీడీవో శ్యాంసుందర్‌, డీటీ రంగారా వు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి సమాచారం తీసుకెళ్లామని అధికారులు తెలిపారు.

తరచూ ప్రమాదాలు..

పెదబయలు మత్స్యగెడ్డలో తరచూ ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల 12వ తేదీన సీకరి పంచాయతీ పన్నెడ గ్రామానికి చెందిన ముగ్గు రు చిన్నారులు ఈతకు వెళ్లి ఇదే మత్స్యగెడ్డలో మునిగి మృత్యువాత పడ్డారు. ఆ ఘటన మరవక ముందే మరో వ్యక్తి గల్లంతు కావడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వేసవిలో గెడ్డలో నీరు తగ్గడంతో గిరిజనులు చేపల వేటకు ఎక్కువగా వెళ్తుంటారని, అధికారులు కేవలం ప్రమాదాలు జరిగినప్పు డే కాకుండా, ముందస్తుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇద్దరి ప్రాణాలు నిలిచాయన్న ఆనందం ఆ కుటుంబంలో క్షణం కూడా నిలవలేదు.. కాపాడిన వ్యక్తే కళ్ల ముందే కొట్టుకుపోతుంటే ఆ చిన్నారుల ఆర్తనాదాలు మత్స్యగెడ్డ తీరాన్ని కన్నీరు పెట్టించాయి.

Advertisement
 
Advertisement
Advertisement