మన్యంలో ఖరీఫ్ సాగుకు గిరిజన రైతులు ముందస్తుగా సన్నద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూములు పదును అవ్వడంతో పెదబయలు మండల వ్యాప్తంగా వేసవి దుక్కులు జోరందుకున్నాయి. దీనివల్ల దుక్కుల వల్ల భూసారం పెరగడమే కాకుండా, చీడపీడల నివారణ జరిగి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని అటు రైతులు, ఇటు వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పెదబయలు: మన్యంలో వేసవి దుక్కులు జోరందుకున్నాయి. చీడపీడల నివారణకు ఈ దుక్కులు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో పంటల సాగుకు వేసవి దుక్కులు అనివార్యమని వారు భావిస్తున్నారు.
● జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు భూమి మెత్తబడడంతో, రైతులు ఒక్కసారిగా పొలాల్లో నాగలి పట్టారు. వేసవి దుక్కుల వల్ల భూసారం పెరిగి, తద్వారా పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నారు. దీంతో గిరిజన రైతులు ఖరీఫ్ పంటల సాగుకు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు.
ఆశాజనకంగా దిగుబడి
మండలంలో వరి, రాగులు, సామలు, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటల సాగు కోసం రైతులు వేసవి దుక్కులు చేస్తున్నారు. వేసవి దుక్కి వల్ల మట్టి వదులుగా మారుతుందని, తద్వారా భూమికి నీటిని పీల్చుకునే (ఇంకే) శక్తి పెరుగుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల మొక్కల వేళ్లు భూమిలోకి బలంగా పాతుకుంటాయని వివరించారు.
● మరోవైపు వేసవి దుక్కుల వల్ల భూమిలోని తెగుళ్ల అవశేషాలు, కీటకాలు, పురుగుల గుడ్లు, లార్వాలు ఎండ తీవ్రతకు చనిపోతాయని రైతులు పేర్కొంటున్నారు. దీనివల్ల తెగుళ్ల సంతతి తగ్గి, కలుపు నివారణ జరిగి పంట దిగుబడి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బాసటగా ఆర్‌బీకేలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా మండల వ్యవసాయ అధికారులు గ్రామాల్లో కల్పించిన అవగాహన వల్లే తాము ప్రతి ఏటా వేసవి దుక్కులు చేస్తున్నామని గిరిజన రైతులు చెబుతున్నారు.
ముందస్తు దుక్కులతో మేలు
మన్యంలో ఎక్కువ శాతం పంటలు వర్షాధారంపైనే పండుతాయని, అందుకే ముందే వేసవి దుక్కులు చేసి పెట్టుకుంటే తొలి వర్షాలు పడగానే విత్తనాలు వేసుకోవడానికి వీలుంటుందని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల పంట ఏపుగా ఎదుగుతుందని, అలాగే వేసవి దుక్కుల తర్వాత పొలంలో పశువుల ఎరువును పలుచగా చల్లి పంట వేస్తే మరింత నాణ్యమైన దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.


