ఏపీ జెన్‌కో అధికారులకు జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశం
సీలేరు: నూతనంగా నిర్మించనున్న 1350 మెగావాట్ల సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు కల్పించే పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఉపాధి అవకాశాలపై 15 రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. గురువారం సీలేరు వచ్చిన ఆమె.. ప్రాజెక్టు స్టేజ్–2 అటవీ క్లియరెన్స్ అనుమతుల కోసం మార్కింగ్ చేసిన సరిహద్దు ప్రాంతాలను అటవీ, జెన్‌కో అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక టింబర్ డిపో వద్ద జెన్‌కో అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూములు, ఖాళీ చేయిస్తున్న గ్రామాల వివరాలు, అక్కడి జనాభా ప్రాతిపదికన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్, ఆర్‌అండ్‌ఆర్ అధికారులు ఫైనలైజ్ చేసిన నిర్వాసితుల జాబితాను ప్రజల ముందు ఉంచాలని సూచించారు.
అనుమానాలు నివృత్తి చేయండి
ప్రాజెక్టు నిర్మాణంపై నిర్వాసిత గ్రామాల్లో ఏవైనా అభ్యంతరాలు లేదా అనుమానాలు ఉంటే, అధికారులు నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లి వారితో సమావేశాలు నిర్వహించాలని జేసీ సూచించారు. నిర్వాసితులకు కల్పించే ప్యాకేజీని లిఖితపూర్వకంగా ఇస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. ప్రాజెక్టు వల్ల పూర్తిగా ఖాళీ అవుతున్న పార్వతీనగర్, బూసుకొండ గ్రామస్తులకు ఒకే చోట పునరావాసం కల్పిస్తే.. అక్కడ అంగన్‌వాడీ, పాఠశాల, తాగునీరు వంటి వసతులు కల్పించడానికి అనుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. నిర్వాసితుల ఉపాధిపై జేసీ ఆరా తీయగా.. ప్రాజెక్టు పనులు ప్రారంభమైన మొదటి రెండేళ్లు నిర్మాణ సంస్థ మెగా కంపెనీలో ఉపాధి కల్పిస్తామని, ఆ తర్వాత ఏపీ జెన్‌కో ద్వారా నిర్వాసిత కుటుంబంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని జెన్‌కో సీఈ రాజారావు జేసీకి వివరించారు. ఈ ఉపాధి హామీపై మరోసారి గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ డీఎఫ్‌వో వైవీ నరసింహారావు, తహసీల్దార్ అన్నాజీరావు, పంప్డ్ స్టోరేజీ ఎస్‌ఈ సీతారామ్, ఈఈలు బాలకృష్ణ, టి.అప్పలనాయుడు, రేంజ్ అధికారి వెంకటరావు పాల్గొన్నారు.


