తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు

May 22 2026 12:24 AM | Updated on May 22 2026 12:24 AM

అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో

మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ పంపిణీ

కలెక్టర్‌ నిశాంతి ఆదేశం

పాడేరు: గిరిజన గ్రామాల్లో వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నిశాంతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో ఆమె వర్చువల్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వేసవిలో తాగునీటి సరఫరాకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్న మారుమూల గ్రామాలను గుర్తించి అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పాడైపోయిన బోర్లు, మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి సమస్యపై పదే పదే ఫిర్యాదులు రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.

ఉపాధి కూలీల పనివేళల మార్పు

వేసవి ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉపాధి కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనివేళలను మార్చినట్లు కలెక్టర్‌ స్పష్టం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు నీడతో పాటు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. ముఖ్యమైన కూడళ్లు, బస్‌ షెల్టర్ల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, ఇంచార్జ్‌ డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ నాగేశ్వరరావు, డ్వామా పీడీ విద్యాసాగర్‌రావు, డీఎల్‌పీవో కుమార్‌, సీపీవో ప్రసాదరావు, ఏపీఎంఐసీ పీడీ రహీం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కరుణాకర్‌, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రతాప్‌, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement