వివరాలు సేకరించిన పాడేరు డీఎల్‌పీవో కుమార్
కొయ్యూరు: బూదరాళ్ల పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వచ్చిన ఫిర్యాదులపై ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, తక్షణమే నివేదిక సమర్పించాలని పాడేరు డీఎల్‌పీవో పీఎన్ కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన బూదరాళ్ల పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గరిమండ గ్రామానికి చెందిన పరమేశ్వరరావు, శివ తదితరులు పంచాయతీలో సుమారు రూ.80 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ జేసీ తిరుమణి శ్రీపూజకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె విచారణకు ఆదేశిస్తూ.. డీఎల్‌పీవోను విచారణ అధికారిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన బూదరాళ్ల సచివాలయంలో ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. డీఎల్‌పీవో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా పంచాయతీలో నిర్వహిస్తున్న రికార్డులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. రూ.82.19 లక్షల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈలు ఫిర్యాదుదారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తారని తెలిపారు. ఇందులో తాగునీటి పథకాల కోసం ఖర్చు చేసిన రూ.47 లక్షలు, క్లాప్ మిత్రల వేతనాలు, ఇతర పనులకు కేటాయించిన రూ.5 లక్షలతో పాటు మిగిలిన నిధుల వ్యయంపై పూర్తిస్థాయిలో పరిశీలన జరుగుతుందన్నారు. పది రోజుల్లో ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని చెప్పారు. ఈ విచారణలో పూర్వ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రస్తుత కార్యదర్శి కృష్ణ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, పంచాయతీని అభివృద్ధి చేసిన వారిపై రాజకీయ ఉద్దేశాలతో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటూ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విచారణాధికారి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు.


