పాడేరు: కలెక్టర్ టి.నిశాంతితో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నిశాంతిని ఆమె తొలిసారిగా కలిసి జిల్లాలోని పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధానంగా తాగునీటి సమస్య అధికంగా ఉందని, ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల నేటికీ డోలీ మోతల సమస్యలు తీరలేదని, మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే తన ఎంపీ లాడ్స్ నిధులతో జిల్లాకు కేటాయించిన అంబులెన్స్‌లను సక్రమంగా వినియోగించాలని, ఏవైనా మరమ్మతులు తలెత్తితే వాటిని తక్షణమే బాగు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అధికారులు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా పారదర్శక పరిపాలన అందించాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎంపీ భర్త, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్ ఉన్నారు.


