జి.మాడుగుల: గ్రామాల్లోని ప్రజలు దోమల నివారణకు తమ నివాస గృహాలలో మలేరియా స్ప్రేయింగ్ (పిచికారీ) చేయించుకోవాలని జిల్లా మలేరియా అధికారి తులసి కోరారు. మండలంలోని పెదలోచలి పంచాయతీ మారుమూల గ్రామాలైన లక్కపాడు, కర్జపల్లి, తియ్యమామిడిలలో జరుగుతున్న మలేరియా స్ప్రేయింగ్ పనులను గురువారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో ఎంపిక చేసిన గ్రామాలు, ఇప్పటివరకు పూర్తయిన పిచికారీ పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ పనులను నిర్దేశిత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దోమకాటు వల్ల ప్రబలే ప్రమాదకర వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, దోమల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దోమకాటు నుంచి రక్షణ పొందడానికి ప్రజలు తమ ఇళ్ల లోపల, బయట స్ప్రేయింగ్ చేయించుకునేలా సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అలాగే, రాత్రి సమయాల్లో విధిగా దోమతెరలు వాడాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గ్రామాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను, వైద్య సిబ్బంది పనితీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్సల్టెంట్ శ్రీనివాసరావు, గిరి, మలేరియా సబ్ యూనిట్ అధికారి గెమ్మెలి నీలకంఠంనాయుడు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


