కొయ్యూరులో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
చింతపల్లి: మన్యంలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. గురువారం కొయ్యూరు మండలంలో అత్యధికంగా 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ విభాగం నోడల్ అధికారి, స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రాంతీయ పరిశోధనా సంచాలకులు (ఏడీఆర్) డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. కొయ్యూరులో 40.8, అరకువ్యాలీలో 37.5, చింతపల్లిలో 36.7, అనంతగిరిలో 36.4, ముంచంగిపుట్టులో 33.5, పెదబయలులో 32.6 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. మైదాన ప్రాంతాల తరహాలోనే ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో మధ్యాహ్నం వేళల్లో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏడీఆర్ పేర్కొన్నారు.


