నమ్మకమే జీవం | - | Sakshi
Sakshi News home page

నమ్మకమే జీవం

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

● ఘనంగా గంగాలమ్మ జాతర సంబరాలు ● వరుణుడి కరుణ కోసం వినూత్న పూజలు ● చెట్లకు నైవేద్యం.. వనదేవతలకు ప్రణామం ● ప్రకృతిని పూజించే పురాతన జీవన విధానం ● జడితో మొదలు..వేటతో ముగింపు ● కొయ్యూరు మండలంలో ప్రారంభమైన పది రోజుల వేడుకలు

మారుతున్న కాలంలోనూ చెరిగిపోని సంస్కృతికి, తరతరాల నమ్మకానికి అద్దం పడుతోంది మన్యం. కొయ్యూరు మండలంలోని గిరిజన పల్లెలు ప్రస్తుతం గంగాలమ్మ పండగ వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న తరుణంలో.. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని గిరిజనులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ‘జడి’ ప్రక్రియతో మొదలై, గంగాచెల్లి ఆటలు, ఊయల ఉత్సవాలు, పనసకాయ వేట వంటి విభిన్న క్రతువులతో పదిరోజులపాటు వేడుకలు సాగుతాయి.
ప్రకృతే దైవం..

విభిన్నం గిరిజన

సంస్కృతీ సంప్రదాయం

కొయ్యూరు: ఖరీఫ్‌ సీజన్‌లో చేపట్టే వ్యవసాయ పనులు సజావుగా సాగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ గిరిజనులు గ్రామగ్రామానా గంగాలమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గంధ అమావాస్య ముగిసిన తర్వాత ఒక్కో గ్రామంలో దాదాపు పది రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. వందల సంవత్సరాల నుంచి గిరిజన మండలాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ పండగలో భాగంగా గ్రామం నుంచి దుష్టశక్తులను పారదోలే ’జడి’ ప్రక్రియ మొదలుకొని, అడవికి వేటకు వెళ్లే వరకు అనేక రకాల క్రతువులను నిర్వహిస్తారు. ఈ పండుగ ముగిసిన తర్వాత గిరిజనులు వినోదాలకు స్వస్తి చెప్పి, తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు.

దుష్టశక్తులను పారదోలే ‘జడి’

పండగ ఆరంభంలో మొదట మూడు రోజుల పాటు ఘటాలను డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగిస్తారు. ఆ తర్వాత వివిధ రకాల పప్పులను కలిపి వండి, ఆ వంటకాన్ని గంగాలమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ఒక బుట్టలో పూజా సామగ్రీతో పాటు కోడిని ఉంచి, దానిని ఈడ్చుకుంటూ గ్రామ పొలిమేర వరకు తీసుకువెళ్తారు. దీనినే ‘జడి’ అని పిలుస్తారు. గ్రామంలోని దుష్టశక్తులన్నీ పొలిమేర అవతలికే వెళ్లిపోవాలనే నమ్మకంతో అక్కడ ఉన్న చెట్లకు నైవేద్యం సమర్పించి పూజలు చేస్తారు. సాధారణంగా ఆదివారం నాడే ఈ క్రతువును నిర్వహిస్తారు. దీంతో ‘జడి’ ప్రక్రియ ముగుస్తుంది.

రాత్రంతా జాగారాలు.. గంగాచెల్లి ఆటలు

పండగ ప్రక్రియ ప్రారంభం కాగానే రాత్రి వేళల్లో మహిళలంతా ఒక జట్టుగా ఏర్పడి గంగాచెల్లి ఆట ఆడుతారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండాలనే భావనను చాటిచెప్పేందుకు ఈ ఆటను నిర్వహిస్తూ రాత్రంతా జాగారం చేస్తారు. ఒకవైపు మహిళలు గంగాచెల్లి ఆడుతుంటే, మరోవైపు పురుషులు డప్పుల మోతల మధ్య గంగాలమ్మ తల్లిని స్మరిస్తూ కోలాటం ఆడతారు.

ఊయల ఉత్సవం

జడి ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రామంలో ఒక పెద్ద ఊయలను ఏర్పాటు చేస్తారు. గ్రామస్తులంతా సంతోషంగా ఉండాలనే ఆకాంక్షతో దీనిని వారం రోజుల పాటు ఉంచుతారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ఊయలపై ఊగుతూ కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతారు.

బాణంతో వేట.. ‘గొర్రె’ వేషాలు

పండగలో భాగంగా నాలుగో రోజున గ్రామ సమీపంలో ఒక పనసకాయను, చిన్న పందిపిల్లను ఒకే చోట ఉంచి బాణంతో వేటాడుతారు. వింటిబద్దతో వేసిన బాణాలు గురితప్పకుండా తగిలితే, అడవికి వేటకు వెళ్లినప్పుడు కచ్చితంగా జంతువులు దొరుకుతాయని వారి నమ్మకం. జంతువు దొరికే వరకు వారు వరుసగా వేటకు వెళ్తూనే ఉంటారు. వేట దొరకని సమయంలో రాత్రి పూట గ్రామంలో ఒకరు ‘గొర్రె వేషం’ వేస్తారు. డప్పు చప్పుళ్ల మధ్య గొర్రె వేషంలో ఉన్న వ్యక్తిని బాణాలతో వేటాడుతున్నట్లుగా అభినయిస్తారు. ఇక పగటివేళల్లో యువకులు ఒంటికి పసుపు, పేడ నీళ్లు పూసుకుని రోడ్డుపై వెళ్లే వాహనదారుల నుంచి డబ్బులు అడుగుతారు. డబ్బులు ఇచ్చిన వారి వాహనాలపై పసుపు నీళ్లు చల్లి, కుంకుమ బొట్లు పెడతారు. అలాగే తమకు వరసయ్యే వారిపై సరదాగా పసుపు నీళ్లతో పాటు పేడ నీళ్లను కూడా పోస్తూ అల్లరి చేస్తారు.

వరుణుడు కరుణించాలని పండగ

వర్షంపై ఆధారపడిన రైతులు వరుణుడు కరుణ చూపాలని చేసేది గంగాలమ్మ పండగ. గంగ అంటే జలం కావడంతో దాని కోసం ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నిచోట్ల దీనిని ఇటుకల పండగ కూడా పిలుస్తారు. పూర్వీకుల కాలం నుంచి సంస్కృతి ప్రతిబించించేలా ఈ పండగను నిర్వహిస్తున్నారు. కోలాటం, గంగాచెల్లి ఆటలు ప్రత్యేకత సంతరించికున్నాయి.

– డీవీడీ ప్రసాద్‌, సేవా ప్రతినిధి, ధార్మిక సంస్థలు, కొయ్యూరు

నాటికి నేటికీ ఎంతో తేడా

గంగాలమ్మ పండగ సందర్భంగా పూజలు క్రతువులు బాగానే నిర్వహిస్తున్నారు. అయితే అనేక విషయాల్లో గతంలో మాదిరిగా జరగడం లేదు. గంగాచెల్లి ఆడేందుకు మహిళలు సరిగా రావడం లేదు. ఒకప్పుడు దీని కోసం పోటీ పడేవారు. ఇక కోలాటం కూడా తక్కువగానే నిర్వహిస్తున్నారు. గతంలో పెద్దవాళ్లు ఆడినట్టుగా ఇప్పుడు యువత ఆడలేకపోతుంది. వేటలకు వెళ్లడం తగ్గించేశారు.

– పూజారమ్మ, మంప, కొయ్యూరు మండలం

Advertisement
 
Advertisement
Advertisement